భూసమస్యలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

భూసమస్యలకు చెక్‌

Jul 17 2026 1:10 AM | Updated on Jul 17 2026 1:10 AM

బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చేయాలనే లక్ష్యంతో భూభారతి భూ రీసర్వేలను చేపట్టింది. జిల్లాలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా భూముల మ్యాపులు సరిగా లేని 7 గ్రామాలను గుర్తించారు. బచ్చన్నపేట మండలంలో కొడవటూర్‌, జనగామ మండలంలో మరిగడి, కొడకండ్లలో నర్సింగాపూర్‌, పాలకుర్తిలో లక్ష్మినారాయణపూర్‌, తరిగొప్పులలో అక్కరాజుపల్లి, చిల్పూర్‌లో రాజవరం, దేవరుప్పులలో చౌడూరు గ్రామాలను గుర్తించి మొదటి విడతగా భూభారతి భూరీసర్వేలను చేయాలని ఆయా మండలాల అధికారులను ఆదేశించారు.

సర్వే చేస్తారిలా..

గ్రామాల్లో గల భూమి, సర్వే నంబర్లను సర్వేయర్లు తీసుకొని మొదటి విడతగా హద్దులు నిర్ణయించారు. మూడు గ్రామాల ట్రై యాంగిల్‌ జంక్షన్‌లను తీసుకొని, 30 మీటర్లకు ఒక హద్దును నిర్ణయించి గ్రామహద్దులను పెట్టారు. రెండో దశలో గ్రామంలోని పట్టా, అసైన్డ్‌, ప్రభుత్వ భూములను గుర్తించి పట్టా భూములను ఐదు ఖండాలుగా విభజించనున్నారు. అలాగే సాగు భూములకు ఎల్‌పీఎం (ల్యాండ్‌ పెంటల్‌ మ్యాప్‌), ఎల్‌పీఎన్‌ (ల్యాండ్‌ పెంటల్‌ నెంబర్‌) భూదార్‌ నెంబర్లు మనకు ఆధార్‌ నంబర్లలాగా ఇస్తారు. పాత హద్దులను గుర్తించడానికి డీజీపీఎస్‌తో రేఖాంశాలు, అక్షాంశాలను గుర్తించి హద్దులను నిర్ణయిస్తారు. చెరువులు, కుంటలు, బాటలు, రోడ్లకు ప్రతీ 200 మీటర్లకు భూదార్‌ నంబర్లను రైతులకు సులువుగా ఉండడానికి కేటాయిస్తారు. ఈ భూములను రీసర్వే చేయడానికి తహసీల్దార్‌, ఎంఆర్‌ఐ, జీపీఓ, సర్వేయర్‌, ఐదుగురు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దానికి తహసీల్దార్‌ నేతృత్వం వహిస్తారు. ఈ భూములను కొలతలు వేయడానికి అధికారులు ఏడు డీజీపీఎస్‌ మిషన్లను ఆయా మండలాల అధికారులకు అందించారు. దీంతో గ్రామంలో ఉన్న భూసమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కానున్నాయి. ప్రతీ రైతుకు రీసర్వేతో న్యాయం చేకూరనుంది. రెండో విడతలో బచ్చన్నపేట మండలంలోని నారాయణపురం, గంగాపూర్‌, ఇటుకాలపల్లి, రామచంద్రాపూర్‌, పుల్లగూడ, దబ్బగుంటపల్లి, బండనాగారం, మన్‌సాన్‌పల్లి, బసిరెడ్డిపల్లి, లక్ష్మాపూర్‌ రెవెన్యూ గ్రామాలలో భూ రీసర్వేలను చేపడతారు.

కొడవటూర్‌లో..

గ్రామంలో 364 సర్వే నంబర్లలో 2470–07 ఎకరాల మొత్తం విస్తీర్ణం భూమిలో 1,740 మంది రైతులు ఖాతాలను కలిగిఉన్నారు. 13 సర్వేనంబర్లలో 362–08 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, ఎకరాలు 30–10 గుంటల భూమిని కెనాల్స్‌ కోసం ప్రభుత్వం కొనుగోలు చేసింది. గ్రామంలో 12రోడ్లు, బాటలు ఉన్నాయి. లక్ష్మాపూర్‌, బండనాగారం, కేసిరెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, బచ్చన్నపేట ఐదు గ్రామాల్లో ట్రైజంక్షన్లు ఉన్నాయి. గ్రామంలో ట్రెయినీ అదనపు కలెక్టర్‌ ఎం.తేజస్విని, ఏడీ మన్నెంకొండ, ఆర్డీఓ గోపీరాంనాయక్‌, తహసీల్దార్‌ ఇంద్రవల్లి హుస్సేన్‌లో పర్యటిస్తూ భూకొలతలను పరిశీలిస్తున్నారు.

భూభారతి భూ రీసర్వేలతో పరిష్కారం

జిల్లాలో 7 గ్రామాల్లో సర్వేలు

సమస్యలు లేకుండా చేస్తాం..

గ్రామాల్లో భూభారతి రీసర్వేలతో భూసమస్యలు పరిష్కారం అవుతాయి. రైతు కలిగి ఉంటే మొత్తం భూమికి భూదార్‌ నంబర్‌ ఒకటే కేటాయిస్తాం. ప్రస్తుతం రైతులు ఎంత సేద్యపు భూమిలో ఉన్నారో కూడా ప్రామాణికంగా తీసుకుంటాం. రైతులకు సమాచారం అందిస్తూనే పనులు చేస్తూ ముందుకు సాగుతాం. – హస్సేన్‌, తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement