● ఇప్పటివరకు 70 శాతానికి పైగా డిజిటైజేషన్
● ఆగస్టు 3 వరకు గడువు పెంచిన కేంద్రం
జనగామ: ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్)లో భాగంగా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) విస్తృతంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఓటర్ల వివరాల ధ్రువీకరణ చేపడుతున్నారు. జిల్లాలో 7,67,484 మంది ఓటర్లు ఉండగా, ఒక్కో బీఎల్‌ఓకు సగటున 887 మంది ఓటర్లు కేటాయించారు. జిల్లాలో మూడు నియోజకవర్గాలు కలిపి ఎస్‌ఐఆర్ డిజిటైజేషన్ 70.40 శాతంగా నమోదైంది. ఈనెల 24వ తేదీ వరకు ఎస్‌ఐఆర్ అవకాశం ఉండగా, కేంద్రం వచ్చే నెల 3వ తేదీ అంటే 10 రోజుల పాటు గడువు పెంచింది.
నియోజకవర్గాల వారీగా
జనగామ నియోజకవర్గంలో 278 మంది బీఎల్‌ఓలు పనిచేస్తుండగా, 2,49,437 మంది ఓటర్లకు సంబంధించిన ఎస్‌ఐఆర్ ఫారాలు 100 శాతం డౌన్‌లోడ్, ముద్రణ, పంపిణీ పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 1,69,281 ఫారాలు (67.87 శాతం) డిజిటైజేషన్ చేయగా, 1,68,494 ఫారాలు (67.55శాతం) బీఎల్‌ఓల ద్వారా ధ్రువీకరించారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో 291 మంది బీఎల్‌ఓలు 2,56,806 మంది ఓటర్లకు సంబంధించిన ఫారాలను పూర్తిగా పంపిణీ చేశారు. ఇందులో 1,89,723 ఫారాలు (73.88శాతం) డిజిటైజేషన్ కాగా, 1,89,210 ఫారాలు (73.68 శాతం) ధ్రువీకరణ పూర్తి చేశారు.
పాలకుర్తి నియోజకవర్గంలో 296 మంది బీఎల్‌ఓలు 2,61,241 మంది ఓటర్లకు సంబంధించిన ఫారాలను పూర్తిగా పంపిణీ చేశారు. ఇందులో 1,81,341 ఫారాలు (69.42శాతం) డిజిటైజేషన్ చేయగా, 1,80,810 ఫారాలు (69.21 శాతం) బీఎల్‌ఓలు ధ్రువీకరించారు. జిల్లా వ్యాప్తంగా 5,40,345 ఫారాలు (70.40శాతం) డిజిటైజేషన్ కాగా, 5,38,514 ఫారాలు (70.17శాతం) ధ్రువీకరణ పూర్తి చేశారు.


