జనగామ రూరల్: తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. గురువారం తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్యాశాఖ, సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ప్రాజెక్టుల్లో తాగునీటికి అవసరమైన నీటి మట్టాల ను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రతీ నీటిబొట్టును సంరక్షించేలా ఇంకుడు గుంతలు, ఇతర నీటి సంరక్షణ పనులను సమర్థవంతంగా చేపట్టాలన్నారు. విద్యార్థులకు అందించాల్సిన ఏకరూప దుస్తుల్లో ఒక జతను ఆగస్టు 15 నాటికి అందజేయాలని ఆదేశించారు. కాగా, జిల్లాలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి రైతుసేవా కేంద్రాలను ఆయన అభినందించారు. వీసీలో డీఏఓ అంబికా సోని, డీఆర్డీఓ భాస్కర్, డీసీఎస్‌ఓ సురేష్ రెడ్డి, డీఎం సీఎస్ హతిరామ్, డీపీఓ వెంకట్ రెడ్డి, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
జిల్లాలో మహిళా శక్తి రైతుసేవా కేంద్రాల ఏర్పాటుపై అభినందన


