● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని బాధ్యతగా, సమర్ధవంతంగా చేపట్టాలని, ప్రతీ ఓటరుతో ఎన్యుమరేషన్ ఫారాలు నింపించి త్వరితగతిన డిజిటలైజేషన్‌ను పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పట్టణ కేంద్రంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలు, సంబంధిత అధికారులతో మాట్లాడారు.. ప్రతీ ఓటరును చైతన్యపరిచి ఎన్యుమరేషన్ ఫారాలను తప్పనిసరిగా నింపించాలన్నారు. అనంతరం స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపాన జాతీయ రహదారిపై నిర్మాణం చేపడుతున్న ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ స్వప్న, మున్సిపల్ కమిషనర్ రాధాక్రిష్ణ తదితరులున్నారు.
విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ
ప్రతీ ఒక్కరూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, అప్పుడే భవిష్యత్‌కు మంచి మార్గం ఏర్పడుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మండలంలోని నమిలిగొండ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. వంటగదిలోని ఆర్‌ఓ ప్లాంట్, వంట సరుకులను, సిద్ధం చేసిన భోజనాన్ని పరిశీలించారు. అరటిపండ్లు నాణ్యతగా లేవని, శుభ్రమైన పండ్లను మాత్రమే విద్యార్థులకు అందించాలన్నారు. కోడిగుడ్ల నాణ్యతను నీళ్లలో వేసి స్వయంగా పరిశీలించారు. అనంతరం పదో తరగతిలో అన్‌అకాడమీ తరగతులను ప్రారంభించి ఫాస్ట్‌మ్యాథ్స్, గెట్ ఐటీ రైట్ పుస్తకాల ప్రాధాన్యాన్ని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీసీడీఓ గౌసియాబేగం, ఎస్‌ఓ రజిత తదితరులు పాల్గొన్నారు.


