వన మహోత్సవానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వన మహోత్సవానికి సిద్ధం

Jul 15 2026 12:47 AM | Updated on Jul 15 2026 12:47 AM

పనులు ముమ్మరం..

జనగామ రూరల్‌: గ్రామాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు, అటవీ విస్తీర్ణం పెంచి సమతుల్య వాతావరణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 25,92,100 లక్షల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా వివిధ శాఖలకు లక్ష్యాలు కేటాయించారు. అత్యధికంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 18 లక్షల20 వేలు లక్ష్యం నిర్దేశించారు. ఉపాధి పథకం కింద గుంతలతీత పనులను పదిహేను రోజుల క్రితం ప్రారంభించారు. ఇప్పటికే 7 లక్షలకు పైగా గుంతలను తీసి సిద్ధంగా ఉంచారు. ఈవారంలో అధికారికంగా వన మహోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 281 గ్రామ పంచాయతీలకు గాను ప్రతీ గ్రామానికి నర్సరీని ఏర్పాటు చేయగా ఈ నర్సరీల్లో మొత్తం 25 లక్షల మొక్కల పెంపకం సంరక్షణ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు చేపడుతున్నారు.

నీడ, పండ్ల మొక్కలే ఎక్కువ

వన మహోత్సవంలో నీడనిచ్చే చెట్లతో పాటు పండ్ల చెట్లను అధికంగా నాటేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంది. రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో నీడనిచ్చే మొక్కలను నాటనున్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రతీ ఇంటికి రెండు మొక్కల చొప్పున పండ్లు, పూల మొక్కలు అందించనున్నారు. రైతులు తమ పొలం గట్లపై నాటుకునేలా పండ్ల మొక్కలను ఇవ్వనున్నారు. అలాగే రహదారుల వెంట నేరేడు పండ్ల మొక్కలను నాటితే కోతులు పంట పొలాల వైపు రాకుండా ఉంటాయని ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేశారు.

వర్షాభావంతో ఆలస్యం

ఏటా ఆగస్టులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంతటా మొక్కలు నాటడం పూర్త య్యే సరికి వర్షాలు తగ్గిపోయి నాటిన మొక్కలు చనిపోతున్నాయి. ఈ క్రమంలో రుతుపవనాలు వచ్చిన మొదట్లోనే నర్సరీల నుంచి మొక్కలను తెచ్చి నాటితే బాగుంటుందని భావించి ఈ ఏడాది ముందుగానే మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఉపాధి హామీ పథకం కింద రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూలీలతో గుంతలను తీస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితి కారణంగా మొక్కలు నాటే కార్యక్రమం కొంత ఆలస్యమవుతోంది.

నాటాల్సిన మొక్కల లక్ష్యం

25.92 లక్షలు

శాఖలవారీగా లక్ష్య నిర్దేశం

7 లక్షలకుపైగా గుంతలతీత పనులు

వన మహోత్సవంలో మొక్కలు నాటేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడితే మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉంటుంది. గుంతలు తీసే ప్రక్రియ ఇప్పటికే చేపట్టాం. ఒకటి రెండు పెద్ద వానలు పడితే నెల చివరి కల్లా పూర్తి చేసే అవకాశం ఉంది.

– భాస్కర్‌, డీఆర్‌డీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement