ప్రభుత్వ భూముల పరిరక్షణలో
కలెక్టర్ దూకుడు
జనగామ: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు రైతుల భూసమస్యల పరిష్కారంపై సమాంతరంగా దృష్టి సారిస్తూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ప్రభుత్వ భూములపై జరిగిన ఆక్రమణలను గుర్తించి వాటిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ చర్యల ఫలితంగా ఇప్పటి వరకు సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షించబడినట్లు సమాచారం.
బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 147లో ఉన్న సుమారు 163 ఎకరాల ప్రభుత్వ భూమిని పూర్తిగా ప్రభుత్వానికి పునరుద్ధరించారు. ఇందులో ప్రధానంగా ఆక్రమణలో ఉన్న సుమారు 84 ఎకరాల భూమిని అధికారుల సమక్షంలో వివరణాత్మక పంచనామా నిర్వహించి భౌతికంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి మూలాధార సెటిల్‌మెంట్ రికార్డుల్లో ‘గెరాన్’గా నమోదై ఉండటంతో పాటు నిషేధిత ఆస్తుల జాబితాలో రక్షణ పొందిన భూమిగా గుర్తించబడింది. అయినప్పటికీ హక్కులు లేని వ్యక్తులు రిజిస్టర్డ్ అమ్మకపు దస్తావేజుల ద్వారా భూమిని స్వాధీనం చేసుకున్నట్లు విచారణలో వెలుగుచూసింది. అదే విధంగా చిల్పూరు మండల కేంద్రంలో ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా విముక్తి చేసి ప్రభుత్వానికి అప్పగించారు. మరోవైపు జనగామ మండలం శామీర్‌పేటలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రైతు భూమి సమస్యకు పరిష్కారం చూపిన కలెక్టర్, బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామంలో దాదాపు 60 ఏళ్లుగా కొనసాగుతున్న వ్యవసాయ పావుల వద్ద పానాది వివాదాన్ని కూడా పరిష్కరి ంచి రైతులకు ఉపశమనం కల్పించారు.
జిల్లాలో ప్రభుత్వ భూములు ప్రైవేటు పట్టాలుగా ఎలా మారాయి? అప్పటి రెవెన్యూ నిబంధనలు ఎందుకు అమలు కాలేదు? మాన్యువల్ రికార్డుల్లో ఎలాంటి మార్పులు జరిగాయి? దశాబ్దాలుగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు ఎలా అనుభవించారనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారుల పాత్రపైనా సమగ్ర విచారణ జరపాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఈ భూములకు రైతుబంధు నిధులు విడుదలయ్యాయా, విడుదలై ఉంటే ఎంత మొత్తం చెల్లించారో విచారించి, అక్రమంగా పొందిన సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
కబ్జాలు, అక్రమ పట్టాలపై దర్యాప్తు
ఆక్రమణల గుట్టు విప్పుతున్న రెవెన్యూ యంత్రాంగం
సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
మరో వెయ్యి ఎకరాలపై విచారణ?


