జనగామ రూరల్: కక్షిదారులు సామరస్యంగా కేసులను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి అన్నారు. మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 18 నిర్వహించే ఎన్‌ఐ యాక్ట్(నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్)పై ప్రత్యేక లోక్ అదాల త్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిట్‌ఫండ్స్, బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఐ యాక్ట్ కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి జి.శశి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండ దయాకర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
సంక్షేమ ఫలాలు
అందించడమే లక్ష్యం
జనగామ: అర్హులైన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు సకాలంలో అందించడమే తన లక్ష్యమని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడకుండా పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి దరఖాస్తులను పరిష్కరించి చెక్కులను అందజేస్తున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జనగామ తహసీల్దార్ కార్యాలయంలో పట్టణం, మండలానికి చెందిన కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి 39 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొంతకాలంగా కల్యాణలక్ష్మి చెక్కులు పెండింగ్‌లో ఉండటాన్ని గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
నేటి పరీక్ష వాయిదా
జనగామ: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్‌డీసీ) విభాగంలోని యూనిట్ 1, యూనిట్ 2కు సంబంధించి జిల్లాలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల కోసం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎంపిక కోసం నేడు(బుధవారం)రోజున నిర్వహించాల్సిన పరీక్షను అనివార్య కారణాల వల్ల ఈనెల 19వ తేదీన నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కుమారస్వామి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మరిన్ని వివరాలకు–79954 30401 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
నేటి నుంచి భద్రకాళి
శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి దేవాలయంలో బుధవారం శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు సహస్ర కలశాభిషేకంలో ఉపయోగించే వేయి మృత్తికా ఘటాలకు సూత్ర వేష్ఠనం (కుండలకు దారాలు చుట్టడం) జరిపారు. రాత్రి 7 గంటలకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో సర్వాంగసుందరంగా మండల రచన చేశారు. చంద్రోదయం అనంతరం రాత్రి అంకురార్పణ జరిపారు.


