న్యూస్‌రీల్
మొదటి రోజు..
నేటి నుంచి జిల్లాలో ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక
గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మొదటి రోజు గ్రామసభను నిర్వహించనున్నారు. 90 నిమి షాలపాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు సాధించిన విజయాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు, ప్రజా సమస్యలు వంటి అంశాలపై విస్త్రృతంగా చర్చ నిర్వహిస్తారు. రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన విజయాలపై వివరిస్తారు.
● 99 రోజుల ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం
● అభివృద్ధి, సంక్షేమంపై అవగాహన.. సమస్యలపై చర్చ
● అధికారులతో కలెక్టర్ సమీక్ష
● ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని ఆదేశం
జనగామ: ప్రజాపాలనను సమర్థవంతంగా అమలు చేయడం, పట్టణాల్లో పర్యావరణ పరిశుభ్రతను పెంపొందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని నిర్ణయించింది. ఈనెల 6 (శుక్రవారం) నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గ్రామసభలో..
గ్రామసభలో వ్యవసాయం, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, మహిళా, శిశు సంరక్షణ, యువజన, క్రీడలు, పర్యావరణం వంటి పలు అంశాలపై చర్చ జరగనుంది. రైతులకు సౌర విద్యుత్ కనెక్షన్ల ప్రయోజనాలు, రైతు భరోసా, రైతుబీమా, సాగునీటి సదుపాయాలు, పీఎం కుసుమ్ పథకం కింద సౌర పంపుల అమలు, అదనపు సౌర విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం, వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు.
రోడ్డు భద్రత..మహిళల సంరక్షణ
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, కమిటీల ఏర్పాటుపై చర్చిస్తారు. అలాగే హైవేలు, ఔటర్ రింగ్ రోడ్లపై భారీ వాహనాల పార్కింగ్‌ను నిరోధించడం, సర్వీస్ రోడ్లను చెత్త నిల్వ ప్రదేశాలుగా ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలి. మహిళలు, బాలల రక్షణకు సంబంధించి వేధింపుల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన అవగాహన, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 0–6 సంవత్సరాల పిల్లలు, కిశోర బాలికల పోషణపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పచ్చదనం పెంపుపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.
సంక్షేమంపై ఇలా..
సంక్షేమ రంగంలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న బియ్యానికి బోనస్, మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో పరిచయం చేస్తారు. పాఠశాలల్లో చేరికలు, బడిబయట పిల్లలు, నాణ్యమైన విద్య, అమ్మ ఆదర్శ పాఠశాలల అమలు, మధ్యాహ్న భోజనంలో పోషకాహార ప్రమాణాలపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్య రంగంలో తల్లి, శిశు సంరక్షణ, టీకాలు, వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల మెరుగుదల, పీహెచ్‌సీల నుంచి రిఫరల్ సేవలపై చర్చించనున్నారు.
పురపాలికలో..
ఈ నెల 6న మున్సిపాలిటీల్లో శానిటేషన్ డ్రైవ్‌లు నిర్వహించాలి. 7న ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, స్థానిక ప్రజలతో శుభ్రత కార్యక్రమాలు, 8న కంపోస్ట్ యూనిట్లు, డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటు, చెత్త సేకరణ, 9న 5కే రన్, పార్కుల్లో కంపోస్టింగ్ కేంద్రాల ఏర్పాటు, 10న ప్రధాన కూడళ్లను గుర్తించి వ్యర్థాలతో కళాకృతులు, 11న మరుగుదొడ్ల పరిస్థితి పరిశీలన, హోటళ్లు, రెస్టారెంట్ల తనిఖీలు, 12న ప్రజాప్రతినిధులకు శిక్షణ, 13న నీటి ట్యాంకులు, రిజర్వాయర్ల శుభ్రత, 14న కూడళ్ల అభివృద్ధి, నర్సరీల సందర్శన, మొక్కల నాటడానికి సన్నాహాలు, 15న ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విద్యార్థులతో శుభ్రత కార్యక్రమాలు, పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ చేస్తారు.


