లింగాలఘణపురం: ‘హలో శ్రావణీ గారా..? మేము లింగాలఘణపురం పీహెచ్‌సీ నుంచి మాట్లాడుతున్నాం.. వైద్య సేవలు ఎలా ఉన్నాయి..? ఏఎన్‌ఎంలు మీ వద్దకు వస్తున్నారా..? నెలలో ఎన్నిసార్లు పరీక్షిస్తు్‌ాన్నరు..? ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకుంటున్నారా..డెలివరీ ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారు..’అంటూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పీహెచ్‌సీ సిబ్బంది అందిస్తున్న సేవలపై గర్భిణికి ఫోన్ చేసి తెలుసుకున్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గర్భిణుల రిజిష్ట్రర్‌ను చూసి అందులో ఒకరిద్దరికి వారి ఫోన్ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి ఏఎన్‌ఎం సేవలపై ఆరా తీశారు. తాను కలెక్టర్‌ను మాట్లాడుతున్నానని అనకుండా పీహెచ్‌సీ నుంచి మాట్లాడుతున్నామంటూ గర్భిణులతో మాట్లాడారు. అంతకు ముందు సిబ్బంది అటెండెన్స్ రిజిష్ట్రర్‌ను పరిశీలించారు. ఓపీ డాక్టర్ గదిలో కాకుండా బయట ఏర్పాటు చేయాలని, ఆర్‌ఓ ప్లాంటు రోగులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ల్యాబ్, ఫార్మసీ, డెలివరీ గదులను పరిశీలించి తగిన సూచనలు చేశారు. అనంతరం ఏఎన్‌ఎంలతో మాట్లాడుతూ.. క్యాన్సర్ టీకా ఏ వయసు వారికి వేయాలని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీలు అయ్యే విధంగా గర్భిణులకు అవగాహన కల్పించాలని డాక్టర్ స్వర్ణలతను ఆదేశించారు.
గర్భిణులతో ఫోన్‌లో ఏఎన్‌ఎం సేవలపై కలెక్టర్ ఆరా..!
పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీ


