చెరువులు.. కాలువలు.. కాలుష్యం | - | Sakshi
Sakshi News home page

చెరువులు.. కాలువలు.. కాలుష్యం

Aug 24 2026 6:57 AM | Updated on Aug 24 2026 6:57 AM

● పర్యావరణానికి పెనుముప్పుగా ప్లాస్టిక్‌ కవర్లు ● పట్టింపులేని అధికారులు

‘ఇది గంజ్‌ ప్రాంతంలోని ప్రధాన నాలా. ప్లాస్టిక్‌, గుడ్డపేగులు, మురికి వస్తువులతో నిండిపోయింది. ఇందులో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడితే నాలా నుంచి ఇళ్లలోకి నీరు వచ్చే ప్రమాదం ఉంది. రక్షణ గోడలు పడిపోయాయి. ఈనీరు పట్టణ పరిధిలోని కండ్లపల్లి చెరువులో కలవడంతో నీరు కలుషితం అవుతోంది’.

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువులు కాలుష్యం బారినపడుతున్నాయి. పట్టణంలోని కాలువలు, నాలాల్లో జనం వేసే ప్లాస్టిక్‌, కొబ్బరి బోండాలు, చికెన్‌ వ్యర్థాలు, మనుషుల వ్యర్థాలు తదితర వస్తువులు చెరువుల్లో చేరి నీళ్లు విషపూరితం అవుతున్నాయి. జగిత్యాల చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులు ఒక వైపు కబ్జాకు గురవుతూ, మరోవైపు కలుషితమై వాటి ఉనికిని కోల్పోతున్నాయి. డ్రెయినేజీల నీటితో మురికికూపాలుగా మారుతున్నాయి. వర్షాలు కురిసినప్పుడు వరదతో పాటు వ్యర్థాలు కొట్టుకువచ్చి నాలాలు, చెరువుల్లో టన్నుల కొద్ది వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.

చర్యలెక్కడ?

జిల్లా కేంద్రం చుట్టూ అంతర్గాం, మోతె, చింతకుంట, కండ్లపల్లి, గోవిందుపల్లి గొలుసుకట్టు చెరువులున్నాయి. వీటిని 5 పాండ్స్‌ ఆఫ్‌ సిటీ అని కూడా పిలుస్తుంటారు. ఇవి కలుషితం అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సీవరేజ్‌ ట్రీట్‌ప్లాంట్‌, అండర్‌ డ్రెయినేజీ సిస్టమ్‌ లేక ఇబ్బందికరంగా మారింది. మున్సిపాలిటీ పరిధిలోని డ్రెయినేజీల నీరంతా అండర్‌ డ్రెయినేజీలోకి వెళ్లాల్సిందే. దీంతో అండర్‌ డ్రెయినేజీ వ్యర్థాలతో పూర్తిగా నిండిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఈ నీరంతా చెరువుల్లో చేరి కలుషితం కావడంతో చేపలు మృత్యువాతపడుతున్నాయి. ఈ చెరువుల్లో మత్స్యకారులు ఎక్కువగా చేపలు పెంచి వాటిని అమ్ముకుని జీవిస్తుంటారు. కాగా, చెరువులు కలుషితం కావడంతో చేపలు మృతిచెంది ఉపాధి కోల్పోతున్నామని వాపోతున్నారు. చెరువుల సంరక్షణను అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా అది ప్రతిపాదనకే పరిమితమైంది. 2–3 ప్రధాన నాలాలున్నాయి. వీటిపై ఎలాంటి కప్పు, రక్షణ గోడలు లేక ప్లాస్టిక్‌, కొబ్బరిబొండాలు, ఇతరత్ర వ్యర్థాలతో నిండిపోతున్నాయి. చిన్నపాటి వర్షానికే నీరంతా ఉప్పొంగి ఇళ్లలోకి చేరుతోంది. యుద్ధప్రతిపాదికన ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెరువులు కలుషితమవకుండా, కబ్జాకు గురికాకుండా చూడాలని, నాలాల్లోని వ్యర్థాలను తొలగించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

‘జిల్లా కేంద్రంలోని జాంబాగ్‌ ప్రాంతంలోని కాలువ ముప్పారపు చెరువు వరకు వెళ్తోంది. కాలువ గుండా ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు చెరువులో చేరి నీరు కలుషితం అవుతోంది. అంతే కాకుండా చేపలు మృత్యువాత పడుతున్నాయి’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement