సిఫార్స్‌ మరిచి.. మోతాదు మించి.. | - | Sakshi
Sakshi News home page

సిఫార్స్‌ మరిచి.. మోతాదు మించి..

Aug 24 2026 6:57 AM | Updated on Aug 24 2026 6:57 AM

● కూరగాయల పంటల్లో ఎక్కువసార్లు పురుగుమందుల పిచికారీ ● రైతులను చైతన్యం చేసే పనిలో ఉద్యాన, వ్యవసాయాధికారులు

జగిత్యాలఅగ్రికల్చర్‌: మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కూరగాయల పంటలపై పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువ కావడంతో రైతులు మోతాదు మించి పురుగుమందుల వాడకం ఎక్కువైంది. కూరగాయల పంటల్లో పురుగుమందుల అవశేషాలు పెరిగిపోతున్నాయని ఇటీవల భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ కూడా హెచ్చరించింది. పురుగుమందుల వినియోగంలో రాష్ట్రం 3వ స్థానంలో ఉండడంతో అప్రమత్తమైన వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు వేపనూనె, జీవ నియంత్రణ, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరించాలని రైతులను చైతన్యం చేసే పనిలో పడ్డారు.

జిల్లాలో 3 వేల ఎకరాల్లో..

జిల్లాలో దాదాపు 3 వేల ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల చుట్టుపక్కల గ్రామాల రైతులతో పాటు వివిధ మండలాల్లో కొంత మేర కూరగాయలు పండిస్తున్నారు. ఎక్కువగా టమాట, బెండ, కాకర, సోరకాయ, వంకాయ, బీరకాయ, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. అయితే, ఆయా పంటలకు ఎక్కువగా పురుగులు ఆశించడంతో విచక్షణ రహితంగా పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. ఏ పురుగుమందును, యే పంటపై, ఎంత మేర కొట్టాలనే విషయాలను రైతులు పెద్దగా పట్టించుకోవడం లేదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదులో కాకుండా, మోతాదు పెంచితే పురుగు త్వరగా చనిపోతుందనే ఉద్దేశంతో పాటు ఫర్టిలైజర్‌ దుకాణదారులు చెప్పిన మందులను ఇష్టారీతిన పంటలపై వాడుతున్నారు.

శుభ్రంగా కడగాల్సిందే..

సాధారణంగా కూరగాయలను మార్కెట్‌కు తీసుకవచ్చే 15–20 రోజుల ముందు రసాయన మందుల పిచికారీ ఆపేయాలి. కానీ, కొందరు రైతులు కూరగాయలు తాజాగా ఉండేందుకు సాయంత్రం మందు పిచికారీ చేసి, ఉదయం మార్కెట్‌కు తీసుకవస్తున్నారు. కనీసం వంకాయ, బెండకాయ, మిర్చి, తీగజాతి వంటి కొన్ని రకాల కూరగాయలపై 4–5 సార్లు మందులు పిచికారీ చేస్తుంటారు. కాబట్టి, మార్కెట్‌ నుంచి ఇంటికి తెచ్చే ప్రతి కూరగాయలను శుభ్రమైన నీటిలో కడగాలి. అలాగే, 2 శాతం ఉప్పు నీటిలో శుభ్రం చేసి తర్వాత మంచి నీటిలో కడిగి వినియోగించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement