ఆప్తమిత్రుడు జయకృష్ణ
చిన్నతనం నుంచి మలి వయసు వరకు వీడని బంధం
రాజకీయాల్లోనూ మరువని స్నేహం
ఆదపలో ఉన్న స్నేహితులకు ఆర్థిక సాయం
ఒకే రంగంలో రాణిస్తున్న పలువురు మిత్రులు
స్నేహమంటే ఇదే అంటున్న ఉమ్మడి జిల్లావాసులు
నేడు స్నేహితుల దినోత్సవం
స్నేహ బిందువు..
జగిత్యాల: స్నేహబంధం చాలా గొప్పది. ఓపెన్‌గా మాట్లాడుకోవడం, ఏ సమస్య ఉన్నా చెప్పుకోవడం ఒక స్నేహితులతోనే ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ కడలి జయకృష్ణ. బీటెక్ పూర్తయ్యాక అమెరికాలో స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయంలో జయకృష్ణ నన్ను ఐఏఎస్‌కు ప్రిపేర్ కావాలని సూచనలు ఇచ్చాడు. అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ వెళ్లి జయకృష్ణ వాళ్ల అక్కయ్య ప్రోత్సాహంతో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యా. ఐఏఎస్ రావడంలో ఒకింత జయకృష్ణ పాత్ర కూడా ఉంది. జయకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం ఫోన్లో మాట్లాడుకుంటాం.
– సత్యప్రసాద్, కలెక్టర్, జగిత్యాల
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఒకప్పుడు స్నేహమంటే ఒకే బెంచ్, ఒకే వీధి, ఒకే ఊరు. ఇప్పుడు స్నేహమంటే ఒకే స్క్రీన్, ఒకే గ్రూప్, ఒకే వీడియో కాల్. కాలంతో పాటు మనుషులు మారారు. స్నేహం కొత్త రూపం దాల్చింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ నేటితరం జీవితంలో నిజమైన దోస్త్‌గా మారాయి. చిన్ననాటి స్నేహితులను మళ్లీ కలిపే వేదికగా, కొత్త పరిచయాలకు పునాదులుగా మారుతున్నాయి. సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షలు, జ్ఞాపకాల ఫొటోలు, రీయూనియన్లు.. ఇవన్నీ డిజిటల్ వేదికలతో సాధ్యమయ్యాయి. వాట్సాప్‌లో వచ్చిన ఒక మెసేజ్‌తో రక్తదానం చేసిన స్నేహితులు, క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.లక్షలు సేకరించి వైద్యం చేయించినవారు.. వరదలు, ప్రమాదాల సమయంలో తమ ప్రాణా లను సైతం ఫణంగా పెట్టి స్నేహితులను కాపాడిన ఘటనలు నిజమైన స్నేహానికి నిర్వచనాలు.
బంధంగా పుట్టకపోయినా..
అనుబంధంగా రూపుదిద్దుకుని..
కలిసిన సమయం నుంచి..
కడదాకా నీడనిచ్చేదే స్నేహం..!
అమ్మ జన్మనిస్తే..
నాన్న జీవితాన్ని ఇస్తాడు..
స్నేహితుడు బతుకుదారి
చూపుతాడు..!!
బుడిబుడి అడుగులతో మొదలయ్యే స్నేహం జీవిత చరమాంకం వరకు కొనసాగుతుంది. బడిబాటతో ముడిపడి.. జీవితంలో స్థిరపడే వరకు వెన్నంటే నడుస్తుంది. ఒకసారి ఫ్రెండ్ అనుకుంటే జీవితకాలం కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తారు. అందుకే స్నేహమంటే రెండక్షరాల పదమే కాదు.. రెండు హృదయాల బంధం..
ఈ ప్రపంచంలో స్నేహితులు లేని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఫ్రెండ్‌షిప్‌కు మారుపేరుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఒకేచోట చదువుకుని.. ఒకే వృత్తిలో కొనసాగుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. స్నేహితులూ ముఖ్యమంటున్నారు. పలువురు తమ స్నేహానికి గుర్తుకు నెలకోసారి కలుసుకుంటున్నారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కథనం.
సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన ప్రముఖ వైద్యులు పి.పెంచలయ్య, ఎన్.వి.రమణరావు, పి.చంద్రశేఖర్ 42ఏళ్ల కిందట మెడిసిన్ చదువుతున్న రోజుల్లో కర్నూల్ మెడికల్ కాలేజీలో స్నేహితులయ్యారు. ముగ్గురు పుట్టి పెరిగిన జిల్లాలు వేరైనా ప్రభుత్వ డాక్టర్లుగా సిరిసిల్లలో స్థిరపడ్డారు. కడపకు చెందిన పెంచలయ్య, నెల్లూరు జిల్లా సర్వేపల్లి మండలం నిడిగుంటపాలెం చెందిన రమణరావు, నెల్లూరు పట్టణానికి చెందిన చంద్రశేఖర్‌కు ఎంబీబీఎస్ కాలేజీ ఫంక్షన్‌లో స్నేహం కలిసింది. పెంచలయ్య, చంద్రశేఖర్ 1993లో, 1995లో రమణరావు సిరిసిల్లకు వచ్చారు. ఇప్పుడు సర్జన్‌గా పెంచలయ్య, ఆర్థోపెడిక్‌గా రమణరావు, డీఎంహెచ్‌వోగా చంద్రశేఖర్ మంచి గుర్తింపు పొంది ఉద్యోగ విమరణ చేశారు.
ఇల్లంతకుంట: ఇల్లంతకుంట పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చుని 10వ తరగతి వరకు చదువుకున్న ఇద్దరు మిత్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామానికి చెందిన గుర్రం సందీప్ రెడ్డి, మల్లారం గ్రామానికి చెందిన సింగిరెడ్డి రమణారెడ్డి పదోతరగతి వరకు కలిసి చదువుకున్నారు. గుర్రం సందీప్‌రెడ్డి 2002లో ఉపాధ్యాయుడిగా ఎంపికై , పెద్ద లింగాపూర్‌లో పనిచేస్తున్నాడు. సింగిరెడ్డి మనోహర్‌రెడ్డి 2005లో ఉపాధ్యాయుడిగా ఎంపికై స్కూల్ అసిస్టెంట్‌గా సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్నాడు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది.


