● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి
జగిత్యాలజోన్: జైలు జీవితంతో ఖైదీల్లో మార్పు రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి సూచించారు. జగిత్యాల స్పెషల్ సబ్ జైలును శనివారం సందర్శించారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలుకు వస్తున్నారని, బయటకు వెళ్లిన తర్వాత మార్పు తెచ్చుకుని సమాజంలో ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. మొదటి అదనపు జిల్లా జడ్జి జి.సునీత మాట్లాడుతూ నేరమయ జీవితానికి అలవాటుపడితే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జైలర్ మొగిలేషు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విజయ్‌కుమార్, రమాదేవి పాల్గొన్నారు.
రాంపూర్ పంప్‌హౌస్ ఎత్తిపోతలు ప్రారంభం
మల్యాల: ఎల్లంపల్లి పంప్‌హౌస్ నుంచి నంది, గాయత్రి పంప్‌హౌస్ ద్వారా నీటిని మధ్యమానేరు, వరదకాలువకు ఎత్తిపోస్తున్న విషయం తెల్సిందే. తాజాగా మండలంలోని రాంపూర్ పంప్‌హౌస్ వద్ద అధికారులు మోటార్లను ఆన్ చేసి కాలువలకు ఎత్తిపోస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పంప్‌హౌస్‌ను సందర్శించి కుంకుమపూజ, హారతి ఇచ్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్‌గౌడ్, నక్క అనిల్, గ్యాదం కుమార్, నాయకులు నల్ల తిరుపతిరెడ్డి, మరాటి సత్తయ్య, కొల్లూరి గంగాధర్, మ్యాక లక్ష్మణ్, దిండు ప్రవీణ్, కంచర్ల లక్ష్మణాచారి, కటుకం వినయ్‌కుమార్, పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకుఎంపిక
ధర్మపురి: మండలంలోని మగ్గిడి సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో జూలై 24న నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో రాణించారు. పరుగు పందెంలో ఎం.రితిక్ 60 మీటర్లు, ఎం.రిషి 400మీటర్లు, విఘ్నేష్ 600మీటర్లు, టి.రిషి 200 మీటర్లు, ఆర్.మణి ప్రతిభ చూపారు. బి. హర్షవర్దన్ షాట్‌ఫుట్‌లో ప్రతిభను కనబర్చాడు. విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు.
ఇబ్రహీంపట్నం విద్యార్థి
ఇబ్రహీంపట్నం: మండలకేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి వి ద్యార్థి బి.జశ్వంత్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ (జావెలెన్‌త్రో) పోటీలకు ఎంపికయ్యాడు. హెచ్‌ఎం రాజన్న మెడల్ అందించి అభినందించారు. పీడీ రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీకి 83,956 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 83,956 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులకు ప్రస్తుతం 1072.9 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 80.5 టీఎంసిలకు, ప్రస్తుతం 28.541 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి 822 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


