జగిత్యాలరూరల్: ప్రభుత్వం రైతుల నుంచి ఐకేపీ, డీసీఎంఎస్, మెప్మా కొనుగోలు కేంద్రాల ద్వారా కొని జిల్లాలోని రైస్‌మిల్లర్లకు సామర్థ్యాన్ని బట్టి అధికారులు ధాన్యం కేటాయించారు. మిల్లర్లు ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కానీ.. కొంతమంది మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్ దాడుల్లో వెలుగుచూస్తోంది.
సకాలంలో అప్పగించని బియ్యం
2024–25 యాసంగి పంటకు సంబంధించిన ధాన్యం తీసుకున్న 69 మంది రైస్‌మిల్లర్లు సీఎంఆర్‌కు 79,395 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. కానీ వారు బియ్యం అప్పగింతలో జాప్యం చేస్తున్నారు. అలాగే 2025–26 వానకాలంలో 119 మంది మిల్లర్లు సీఎంఆర్‌కు 1,76,951 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. దీనికి కొంత గడువు ఉన్నా.. చాలామంది అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2025–26 యాసంగిలో 116 మంది మిల్లర్లు సీఎంఆర్‌కు 3,11,251 టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. దీనికి కూడా కొంత గడువు ఉండగా, బియ్యం సేకరణలో కొంత జాప్యం నెలకొంది.
వెలుగు చూస్తున్న నిజాలు
వాస్తవానికి బియ్యం బకాయి ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయించొద్దు. అయితే కొందరు మిల్లర్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ నుంచి నేరుగా ఆదేశాలు తెచ్చుకుని ధాన్యం కేటాయింపు చేయించుకున్నారు. వారిలోని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు.
మిల్లుల్లో కనిపించని ధాన్యం
జిల్లాలో 2024 నుంచి 2025–26 యాసంగికి సంబంధించిన ధాన్యం మిల్లర్లకు కేటాయించగా.. ధాన్యాన్ని సీఎంఆర్ అప్పగించాల్సి ఉంది. కానీ 20 శాతం మంది రైస్‌మిల్లర్లు ప్రభుత్వం నుంచి వచ్చిన ధాన్యాన్ని విక్రయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సకాలంలో బియ్యం అప్పగించాలి
ధాన్యం తీసుకున్న మిల్లర్లు నిబంధనల ప్రకారం సీఎంఆర్ అప్పగించాలి. అక్రమాలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు డిఫాల్టర్‌గా ప్రకటించి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
– జితేంద్రప్రసాద్,
జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్


