జగిత్యాలఅగ్రికల్చర్: ఎడతెరిపి లేకుండా రెండురోజులు కురిసిన వర్షాలకు కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో కూరగాయలు మార్కెట్‌కు రాక వినియోగదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రైతులు ఎక్కువగా సాగు చేసిన టమాట, బీర, సోర, వంకాయ, కొత్తిమీర, పాలకూర వంటి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. 130ఎకరాల్లో టమాట, 200ఎకరాల్లో బీర, సోర, కాకర, 40 ఎకరాల్లో వంకాయ, 60ఎకరాల్లో బెండ, మరో 90 ఎకరాల్లో ఆకు కూరలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వానాకాలం సీజన్ అయిన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూరగాయలకు డిమాండ్ ఉంటుంది. మార్కెట్ డిమాండ్‌ను అనుసరించిన కొందరు రైతులు మేలో కూరగాయల విత్తనాలు నాటారు. కలుపు రాకుండా మల్చింగ్ పేపర్ వేశారు. అన్నిరకాల యాజమాన్య పద్ధతులు పాటించడంతో పంట ఏపుగా పెరగడంతో రైతులు సంతోషించారు.
పూతను దెబ్బతీసిన వర్షాలు
కూరగాయల పంటల్లో పూత నుంచి కాత మొదలవుతున్న తరుణంలో వచ్చిన వర్షాలు కూరగాయల పంటలను దెబ్బతీశాయి. ఫలితంగా రైతుల ఆశలు ఆడియాసలయ్యాయి. కూరగాయల తోటల్లో నీరు నిలిచి, మొక్కలు పసుపు పచ్చగా మారాయి. ఈదురుగాలులకు పూత రాలిపోయింది. వేర్లు కుళ్లిపోయి మొక్కలు చనిపోయాయి. చేతికి వస్తుందనుకుంటున్న తరుణంలో వర్షాలు పడడంతో పెట్టుబడి కూడా రాదని రైతులు అంటున్నారు.
పెరుగుతున్న రేట్లు
జిల్లాలో సాగు చేసిన కూరగాయలు మార్కెట్‌కు రాకపోవడంతో మహారాష్ట్రలోని నాందేడ్, చిత్తూరు జిల్లాల నుంచి టమాటలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా టమాట కిలో రూ.30 వరకు పలుకుతోంది. సోరకాయ రూ.20, బీర రూ.80కి చేరింది. కాకర కిలో రూ50 నుంచి రూ.60, వంకాయలు రూ.40 నుంచి 50 వరకు ఉంది. పాలకూర, తోటకూర వంటివి మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు. మిర్చి కిలో రూ.50 నుంచి 60కు చేరింది.


