తీర ప్రాంతం.. వరద భయం | - | Sakshi
Sakshi News home page

తీర ప్రాంతం.. వరద భయం

Aug 2 2026 12:16 AM | Updated on Aug 2 2026 12:16 AM

ప్రతిపాదనలోనే గోదావరి కరకట్ట నిర్మాణం

వర్షాకాలం అంటేనే జంకుతున్న ధర్మపురి

శాశ్వత పరిష్కారం చూపాలంటున్న స్థానికులు

ధర్మపురి: వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరి తీరప్రాంత వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. వరదలతో ఏటా లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరుగుతోంది. ధర్మపురి పట్టణ అభివృద్ధికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా వరద ముప్పును నియంత్రించడంలో అధికారులు, పాలకులు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి.

కడెం నుంచి వచ్చే వరదతో..

ఏటా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరి ఉగ్రరూపమై తీరప్రాంత వాసులను వరదతో ముంచేస్తోంది.

కడెం ప్రాజెక్టు నుంచి వచ్చే వరదతో మండలంలోని ఆరెపెల్లి, దొంతాపూర్‌, జైనా, రాజారం దమ్మన్నపేట, ధర్మపురికి వరద పోటెత్తుతుంది. దీంతో గోదావరి ఒడ్డునున్న పంట పొలాలు, విద్యుత్‌ మోటార్లు, స్తంభాలు నీట మునిగి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించిన ఘటనలున్నాయి.

వరదలతో నష్టపోయిన ప్రాంతాలు..

గోదావరి వరద పోటెత్తడంతో ధర్మపురిలోని మంగలిగడ్డ, బ్రాహ్మణ సంఘం, సంస్కృతాంధ్ర కళాశాల, సంతోషిమాత, రామాలయం, బోయవాడ, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నీటిలో మునిగిపోతుంటాయి. వీటితో పాటు వరద ఇళ్లలోకి చేరి వస్తువులు కొట్టుకుపోవడం, సామగ్రి నానిపోయి తీవ్ర ఆస్తి నష్టం సంభవిస్తుంది. గతంలో వరదలతో నష్టపోయిన ముంపు ప్రాంతాలను అధికారులు గుర్తించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

ప్రతిపాదనలోనే కరకట్ట నిర్మాణం

ధర్మపురి తీరప్రాంత వాసులను వరద ముప్పు నుంచి కాపాడేందుకు గతంలో కరకట్ట నిర్మాణం కోసం సర్వే చేసి గాలికొదిలేశారు. కరకట్టను గోదావరిలోని హనుమాన్‌ గడ్డ నుంచి కింద నున్న మహాలక్ష్మి ఘాట్‌ వరకు 2 కి.మీ పొడవు నిర్మించేందుకు సర్వే చేపట్టారు. రూ.4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కాగా, కరకట్ట నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement