● వరుస విజిలెన్స్, ఏసీబీ తనిఖీలు ● ఉద్యోగుల్లో గుబులు ● శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు
● జూన్ 29న మల్యాల మండలం గొర్రెగుండం గ్రామశివారులో ఓ వ్యక్తి తన పట్టా భూమిలో 201 టేకుచెట్ల నరికివేతకు పర్మిషన్ తీసుకుని ఎక్కువ చెట్లు నరికివేశారని రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయడంతో పాటు, చర్యల కోసం సిఫారసు చేశారు.
● ఏప్రిల్ 22న సారంగాపూర్ మండలం మ్యాడారం తండాకు చెందిన ఆరుగురు వ్యక్తులు అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ షాక్ అమర్చగా రెండు అడవి దున్నలు మృతిచెందాయి. గుట్టుచప్పుడు కాకుండా బీర్‌పూర్ మండలంలోని ఓ గ్రామంలో దహనం చేయగా ఈ విషయం బయట పడటంతో మ్యాడారంతండాకు చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేయడంతో పాటు, ఇద్దరు అటవీశాఖ అధికారులకు మెమోలు జారీ చేశారు.
జగిత్యాలక్రైం: పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అంటున్నారు కానీ అటవీశాఖ అధికారులు మాత్రం అడవుల సంరక్షణలో పూర్తిగా విఫలమయ్యారు. అడవుల్లో చెట్లు నరికి కబ్జాలు చేసుకుని సాగు చేసుకుంటున్నా, స్మగ్లర్లు అడవుల్లో ఉన్న పెద్ద వృక్షాలను నరికి కలపను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నా అటవీశాాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పాటు అటవీశాఖలో అవినీతిమయం చోటుచేసుకుందని పలువురు ఫిర్యాదులు చేస్తుండటంతో ఇటు ఏసీబీ అధికారులు, అటు విజిలెన్స్ అధికారులు పలుమార్లు తనిఖీలు చేపడుతూ విచారణ చేపడుతున్నా అటవీశాఖ ఉద్యోగుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో అటవీశాఖపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతుల పేరుతో చెట్ల నరికివేత
జగిత్యాల జిల్లాలో పర్యావరణ పరిరక్షణ దేవుడెరుగు కానీ అటవీశాఖ అధికారులు మాత్రం అవేం పట్టించుకోవడం లేదు. అనుమతుల పేరుతో పట్టా భూముల్లో ఉన్న చెట్లు నరికేందుకు అనుమతులు ఇస్తుండటంతో చాలా మంది పట్టా భూములతో పాటు, అడవుల్లో ఉన్న చెట్లను నరికి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పాటు గ్రామాల్లో వ్యవసాయ భూముల్లో ఉన్న చెట్లు నరికివేసేందుకు సామిల్ యజమానులకు అనుమతులు ఇస్తుండటంతో గ్రామాల్లో ఉన్న భారీ వృక్షాలు నేలమట్టం చేసి కలపను తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
అటవీ భూములకు రక్షణ కరువు
జిల్లాలో ఉన్న అటవీ భూములకు అధికారుల తీరుతో రక్షణ కరువైంది. గ్రామాల్లో ఉన్న భూ యజమానులు అటవీ భూములను జేసీబీ, ప్రొక్లెయిన్‌లతో చదును చేస్తూ అటవీ భూములను చదును చేసుకుంటున్నా అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో తెలిసి తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో చాలా చోట్ల అటవీ భూములు కబ్జాకు గురవుతుండటంతో పాటు అడవులు అంతరిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
అడవి జంతువుల రక్షణపై చర్యలు శూన్యం
అడవుల్లోకి వేటగాళ్లు వెళ్లి అడవి జంతువులను వేటాడుతున్నా వారిని పట్టుకోవడంలో అటవీశాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో వేటగాళ్ల చేతుల్లో వందలాది వణ్య ప్రాణులు బలవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.


