సిరిసిల్ల/గంగాధర/రామడుగు/రాయికల్/కరీంనగర్‌కల్చరల్: ఆషాఢ మాసంలో తెలంగాణలో ఏ పల్లెలో చూసిన బోనాల పండుగ సందడి కనిపిస్తుంది. ఏటా ఆషాడంలో మహంకాళి అమ్మవారికి బోనాలు తీసి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు కొనసాగించారు. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్స్(ఈటీసీఏ) ఆధ్వర్యంలో దుబాయ్‌లోని రాస్ ఆల్‌ఖైమా–మైత్రి ఫారమ్స్‌లో బోనాలు వేడుకలు నిర్వహించారు. అబుదాబీ, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ ఖవైన్, రాస్ ఆల్ ఖైమా, పుజైరా ప్రాంతాల్లో ఉంటున్న ప్రవాస తెలంగాణ వాసులు సుమారు 400 ఈ వేడుకలకు హాజరయ్యారు. బోనాల ఊరేగింపు, డోలు కళాకారుల నృత్యాలు, మహంకాళి అమ్మవారి అలంకారం, మంత్రోచ్ఛరణల మధ్య దీపప్రజ్వన, కుంకుమార్చన కనులపండువగా సాగాయి. కరీంనగర్ చెందిన కొత్త జయపాల్‌రెడ్డి, ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్‌కుమార్ పీచర, జగదీశ్‌రావు, ఎల్‌ఎస్‌పీఎంకే గ్రూప్ చైర్మన్ రాధారపు సత్యం, రమేశ్, శ్రీనివాస్ ఎలిగేటి, రాణి కొట్ల, శేఖర్‌గౌడ్ గుండవేణి, తిరుమల్‌రావు బీరెల్లి, కస్తూరి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


