ప్రతీకారం తప్పదు | World leaders criticise Donald Trump tariffs as major blow | Sakshi
Sakshi News home page

ప్రతీకారం తప్పదు

Apr 4 2025 1:07 AM | Updated on Apr 4 2025 1:07 AM

World leaders criticise Donald Trump tariffs as major blow

ట్రంప్‌ సుంకాలపై దేశాల ధ్వజం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన తాజా టారిఫ్‌లపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెర తీశారంటూ దుయ్యబడుతున్నాయి. ప్రతీకారం తప్పదని ఆయా దేశాల అధినేతలు స్పష్టం చేశారు. వాణిజ్య యుద్ధాలు ఇరు పక్షాలను దెబ్బతీస్తాయని జర్మనీ హెచ్చరించింది. తమపై ట్రంప్‌ విధించిన 10 శాతం  సుంకాన్ని ఎదుర్కోవడానికి లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్‌ బుధవారం ఒక చట్టాన్ని ఆమోదించింది. 

దెబ్బకు దెబ్బ: ఈయూ 
యూరోపియన్‌ యూనియన్‌పై 20 శాతం సుంకాలను యూరప్‌ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇది పూర్తిగా అన్యాయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘అమెరికా వస్తువులకు ఈయూ అతి పెద్ద మార్కెటని ట్రంప్‌ మర్చిపోయినట్టున్నారు. యూఎస్‌పై ప్రతీకార సుంకాలు విధిస్తాం’’అని హెచ్చరించాయి. ‘‘ఈయూ ఉక్కుపై అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ప్రతీకార ప్యాకేజీని ఖరారు చేస్తున్నట్టు ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండడెర్‌ లెయన్‌ ప్రకటించారు. చర్చలు విఫలమైతే తమ ప్రయోజనాలను, వ్యాపారాలను రక్షించుకోవడానికి మరిన్ని ప్రతీకార సుంకాలు తప్పవని స్పష్టం చేశారు. అయితే ఈ సుంకాల యుద్ధంతో అంతిమంగా నష్టపోయేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

...సమరమే: కెనడా 
ప్రపంచ వాణిజ్య వ్యవస్థనే అతలాకుతలం చేసే ట్రంప్‌ సుంకాలపై పోరాడతామని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ ప్రతిజ్ఞ చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే కెనడాపై తాజా టారిఫ్‌ల ప్రభావం పరిమితమే. అయినా ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై అమెరికా సుంకాలు లక్షలాది కెనడియన్లను నేరుగా ప్రభావితం చేస్తాయని కార్నీ ఆక్షేపించారు. ఈ సుంకాలను ప్రతిదాడులతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. 

మంచిది కాదు: బ్రిటన్‌ 
వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదని బ్రిటన్‌ ప్రధాని కియిర్‌ స్టార్మర్‌ వ్యాఖ్యానించారు. ‘‘అన్ని పరిస్థితులకూ మేం సిద్ధంగా ఉన్నాం. ప్రతిస్పందనగా మావైపు నుంచి ఏ చర్యలనూ తోసిపుచ్చలేం’’అని పార్లమెంటుకు చెప్పారు. 

విచారకరం: జపాన్‌ 
ఈ దిగుమతి సుంకాలు చాలా విచారకరమని జపాన్‌ వ్యాఖ్యానించింది. అవి ప్రపంచ వాణిజ్య సంస్థ, యూఎస్‌–జపాన్‌ ఒప్పందాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. అమెరికా తమపై విధించిన 36 శాతం సుంకంపై చర్చలు జరుపుతామని అయితే థాయిలాండ్‌ తెలిపింది. సుంకాల ప్రకటనకు ఒక రోజు ముందే.. అమెరికా దిగుమతులపై ఇజ్రాయెల్‌ అన్ని సుంకాలను రద్దు చేసినా.. ఫలితం లేకపోయింది. ఇజ్రాయెల్‌ వస్తువులపై ట్రంప్‌ 17 శాతం సుంకాలను విధించడంపై ఆ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.  

భారీ మూల్యం తప్పదు: ఆ్రస్టేలియా 
ఆ్రస్టేలియా గొడ్డు మాంసంపై ట్రంప్‌ కఠిన ఆంక్షలు దారుణమని ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ విమర్శించారు. ఇందుకు అమెరికా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయితే, ‘‘మేం పరస్పర సుంకాలకు దిగబోం. అధిక ధరలకు, ఆర్థిక మందగమనానికి దారితీసే రేసులో చేరబోం’’అని స్పష్టం చేశారు. 

కంపెనీలను కాపాడుకుంటాం: స్పెయిన్‌ 
దేశీయ కంపెనీలను, పరిశ్రమలను, మొత్తంగా ఆర్థిక రంగాన్ని ఈ సుంకాల ప్రభావం బారినుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరతామని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ ప్రకటించారు. స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచమే తమ లక్ష్యమన్నారు. 

గొడవలొద్దు: స్వీడన్‌ 
వాణిజ్య అడ్డంకులను కోరుకోవడం లేదని స్వీడన్‌ ప్రధాని ఉల్ఫ్‌ క్రిస్టెర్సన్‌ అన్నారు. ‘‘మాకు వాణిజ్య యుద్ధం వద్దు. అమెరికాతో కలిసి వాణిజ్యం, సహకార మార్గంలో పయనించాలని, తద్వారా ఇరు దేశాల ప్రజలు మెరుగైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం’’అని చెప్పారు. 

హానికరమైన సుంకాలు: ఇటలీ 
ట్రంప్‌ సుంకాలను ఆయన మిత్రురాలు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఘాటుగా విమర్శించారు. ఈ సుంకాలు హానికరమని హెచ్చరించారు, ‘‘వాణిజ్య యుద్ధాన్ని నివారించాలి. అది తీవ్రతరం కాకముందే పరిష్కారం కోసం అమెరికా ప్రయతి్నంచాలి’’అని సూచించారు. 

ఆర్థిక సంక్షోభం: ఫ్రాన్స్‌ 
ట్రంప్‌ సుంకాలు అతి పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తాయని ఫ్రాన్స్‌ ఆందోళన వెలిబుచి్చంది. ఫ్రెంచ్‌ వైన్, స్పిరిట్స్‌ ఎగుమతులపై ఇవి గణనీయ ప్రభావం చూపుతాయని ప్రభుత్వ ప్రతినిధి సోఫీ ప్రైమాస్‌ వ్యాఖ్యానించారు. 

తక్షణం రద్దు చేయాలి: చైనా 
ఏకపక్ష టారిఫ్‌లను అమెరికా తక్షణం రద్దు చేయాలని చైనా డిమాండ్‌ చేసింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఇవి గొడ్డలి పెట్టని అభిప్రాయపడింది. అమెరికా ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ సరఫరా గొలు సులను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించింది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికాకు సూచించింది.

చర్చలే మార్గం: దక్షణ కొరియా 
ఈ సమస్యకు చర్చలే మార్గమని ద క్షణ కొరియా అభిప్రాయపడింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం వాస్తవ రూపం దాల్చిందని తాత్కాలిక అధ్యక్షుడు హాన్‌ డక్‌ సూ అన్నారు. ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి శక్తి సామ ర్థ్యాలన్నింటినీ ధారపోద్దామని చెప్పారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
Advertisement