దేశ సేవ నేరమా?  | Working in national interest, not against Congress | Sakshi
Sakshi News home page

దేశ సేవ నేరమా? 

Jun 6 2025 5:06 AM | Updated on Jun 6 2025 5:06 AM

Working in national interest, not against Congress

నాపై విమర్శలు చేసేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి  

పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు  

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పష్టికరణ   


వాషింగ్టన్‌: దేశ ప్రయోజనాల కోసం పని చేయడం నేరమా? అని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ ప్రశ్నించారు. దేశానికి సేవ చేయడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా భావించేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్‌ నాయకత్వానికి చురక అంటించారు. వారిని వారు ప్రశ్నించుకుంటే అసలు నిజం ఏమిటో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. 

ఆపరేషన్‌ సిందూర్‌పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తున్న శశిథరూర్‌ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానంటూ తనపై కొందరు కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న విమర్శలపై స్పందించారు. దేశానికి సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి చిల్లరమల్లర విమర్శలు, ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

 తాను బీజేపీలో చేరబోతున్నానంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రజలు తనను పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నుకున్నారని, ఎంపీగా పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉందని, ఇలాంటి సమయంలో పార్టీ మార్పు ప్రశ్న ఎందుకు చర్చకు వస్తోందో తనకు అర్థం కావడం లేదన్నారు. పార్టీ మారాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు.   

ట్రంప్‌ వ్యాఖ్యలు ‘చిన్న విషయం’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, అందుకే పాకిస్తాన్‌పై యుద్ధం హఠాత్తుగా ఆపేశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై చేసిన ఆరోపణల పట్ల శశి థరూర్‌ స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పారీ్టలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సహజమేనని కొట్టిపారేశారు. అయినా తాము ఇక్కడికి రాజకీయ కార్యక్రమం కోసం రాలేదని, ఐక్య భారత్‌ ప్రతినిధులుగా వచ్చామని చెప్పారు.

 భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశ సందేశానికి ప్రపంచ దేశాలకు చేరవేస్తున్నామని ఉద్ఘాటించారు. అఖిలపక్ష బృందంలో వేర్వేరు పార్టీల నేతలు సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు. ఇది కూడా భిన్నత్వంలో ఏకత్వానికి సంకేతమని వివరించారు. మన మధ్య రాజకీయ విభేదాలు ఏవైనా ఉంటే అవి దేశ సరిహద్దుల్లోనే ఆగిపోవాలని, సరిహద్దు దాటితే మనమంతా భారతీయులమేనని గతంలో ఒక సందర్భంలో తాను చెప్పినట్లు గుర్తుచేశారు. 

భారత్‌–పాకిస్తాన్‌ మధ్య అణు యుద్ధాన్ని ఆపేశానంటూ ట్రంప్‌ పదేపదే చెబుతుండడంపై ప్రశ్నించగా, ‘‘ట్రంప్‌ వ్యాఖ్యలు, వాటిపై రాహుల్‌ విమర్శలు నిజానికి చిన్న విషయాలు’’ అంటూ థరూర్‌ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌పై భారత్‌కు ఎంతో గౌరవముంది. ఇలాంటి ఉదంతంతో ద్వైపాక్షిక సంబంధాలు సంక్లిష్టం కావడం భారత్‌కు ఇష్టం లేదు. ఒక్కటి మాత్రం సుస్పష్టం.

 మధ్యవర్తిత్వం కోసం ఎవరినో ప్రాధేయపడాల్సిన అవసరం భారత్‌కు లేదు. పాక్‌ దాడి చేస్తే గట్టిగా బదులిస్తామని, ఆపేస్తే తామూ ఆపేస్తామని భారత్‌ మొదట్లోనే చెప్పింది. అలాంటప్పుడు పాక్‌పై దాడులు ఆపాలని మాకు ఇంకెవరో చెప్పే సందర్భమే తలెత్తదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఆపరేషన్‌ సిందూర్‌ను తట్టుకోలేక పాకే అమెరికా శరణుజొచ్చిందేమో. లేదంటే కాల్పుల విరమణ కోసం అమెరికాయే పాక్‌పై ఒత్తిడి చేసి ఉండొచ్చు’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement