అనుమానపు ట్రంప్‌.. రహస్య విచారణకు ఆదేశం! | Why Donald Trump Secret Services Investigation Over UN Three Incidents, Watch Video Inside | Sakshi
Sakshi News home page

అనుమానపు ట్రంప్‌.. రహస్య విచారణకు ఆదేశం!

Sep 25 2025 8:48 AM | Updated on Sep 25 2025 10:31 AM

Why Donald Trump Secret Services Investigation Over UN Three Incidents

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితికి మంగళవారం సతీమణి మెలానియాతో కలిసి వెళ్లిన ఆయన.. జనరల్‌ అసెంబ్లీ 80వ సమావేశంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ  తనకు ఎదురైన అనుభవాలు యాదృచ్ఛికమేమీ కాదని.. ఇందులో కుట్ర దాగి ఉందని అంటున్నారాయన. 

ఐక్యరాజ్య సమితిలో వరుస చేదు అనుభవాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు సార్లు సాంకేతిక వైఫల్యాలు చోటుచేసుకున్నాయన్న ఆయన.. అదేం యాదృచ్ఛికం కాదని అనుమానం వ్యక్తం చేశారు. ఎస్కలేటర్‌, టెలిప్రాంప్టర్‌, సౌండ్‌ సిస్టమ్‌ పనిచేయకపోవడం.. ఈ మూడు ఘటనలు దురుద్దేశపూర్వకంగానే కనిపిస్తున్నాయన్నారు. 

మొదటిది.. ట్రంప్‌ తన సతీమణి మెలానియా, సిబ్బందితో ఎస్కలేటర్‌పై ఉన్న సమయంలో అది అకస్మాత్తుగా ఆగిపోయింది. రెండోది.. ఆయన యూఎన్‌జీఏలో ప్రసంగించేటప్పుడు టెలిప్రాంప్టర్ పని చేయలేదు. దీంతో ఆయన ప్రింటెడ్‌ కాపీ ద్వారా తన సందేశాన్ని చదివి వినిపించారు.  మూడోది.. ప్రసంగ సమయంలో మైక్ పనిచేయకపోవడం. దీని వల్ల అక్కడున్నవాళ్లు(భార్య మెలానియాతో సహా) తన మాటలు వినలేకపోయారని.. ఇంటర్ప్రెటర్లు ద్వారా మాత్రమే వాళ్లకు వినిపించిందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ఆయన అక్కడికక్కడే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే..

ఇది తనపై జరిగిన కుట్రగా ఆయన భావిస్తున్నారట. వీటిపై విచారణకు రహస్య దర్యాప్తు సంస్థలను పురమాయించినట్లు, వీటి వెనుక ఎంతటివారున్నా వదిలే ప్రసక్తే లేదంటూ సోషల్‌ మీడియా ద్వారా ట్రంప్‌ వెల్లడించారు. అయితే.. 

ఐక్యరాజ్య సమితి(UNO) ట్రంప్‌ అనుమానాలను తోసిపుచ్చింది. అమెరికా ప్రతినిధుల బృందంలోకి ఓ వీడియోగ్రాఫర్‌ పొరపాటున స్టాప్‌ బటన్‌ నొక్కడంతో ఎస్కలేటర్‌ ఆగిపోయి ఉంటుందని యూఎన్‌ అధికార ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. ఇక.. టెలిప్రాంప్టర్ నిర్వహణ వైట్ హౌస్ బాధ్యత కాబట్టి తమపై ఆరోపణలు సరికావని అంటోంది. 

ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌(New York City)లో ఉంది. ఇక్కడ నిర్వాహణ లోపాలు బయటపడడం తరచూ జరిగేదే. దీనికి తోడు నిధుల లేమితో ఈ అంతర్జాతీయ సంస్థ ఈ మధ్యకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే హెడ్‌ ఆఫీస్‌తో పాటు జెనీవాలో ఉన్న కార్యాలయంలోనూ ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, ఏసీలు, లైట్లు ఆఫ్‌ చేయిస్తోంది కూడా. యూఎన్‌కు అత్యధికంగా ఆర్థిక సాయం అందించేది అమెరికానే. అలాంటి దేశం నుంచి ఫండింగ్‌ ఆగిపోవడంతో ఐరాసకు ఈ పరిస్థితి నెలకొంది.

ఇదీ చదవండి: 150 దేశాలు.. ఐరాసను చీల్చి చెండాడిన ట్రంప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement