
ఐక్యరాజ్యసమితి తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం
ఏడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలు ఆపేశా
ఐరాస పని నేను చేయాల్సి రావడం బాధాకరం
భారత్, పాకిస్తాన్ మధ్య శాంతికి నేనే చొరవ తీసుకున్నా
ఉక్రెయిన్‌పై యుద్ధానికి భారత్, చైనాలే నిధులిస్తున్నాయి
రష్యా నుంచి చమురు కొనడం నాటో దేశాలు ఆపాలి
ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం అంగీకరించం
అక్రమ వలసలకు ఐరాస వత్తాసు దురదృష్టకరం
మా సార్వభౌమత్వం కాపాడుకోవడానికే టారిఫ్‌లు
ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో ట్రంప్
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాకు సమీపంలోకి వచ్చే మరో దేశం లేనేలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. భూగోళంపై వ్యాపారం, వాణిజ్యంలో అత్యుత్తమ దేశం తమదేనని స్పష్టంచేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని, నానాటికీ మరింత బలం పుంజుకుంటోందని అన్నారు. అమెరికాకు గతంలో ఎన్నడూ దక్కనంత గౌరవం ఇప్పుడు దక్కుతోందని వివరించారు. తాను మొదటి పర్యాయం అధ్యక్షుడిగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే తమ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
ప్రపంచ చరిత్రలో ఇదొక పరిణామం అని అభివరి్ణంచారు. మంగళవారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ(జనరల్ అసెంబ్లీ) 80వ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ సుదీర్ఘంగా ప్రసంగించారు. పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి పనితీరుపై నేరుగా విమర్శలు గుప్పించారు. అదొక డొల్ల సంస్థగా మారిందని ఆక్షేపించారు. గొప్ప శక్తిసామర్థ్యాలు కలిగిన అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి ఇప్పుడు దాదాపు నిరీ్వర్యమైపోయిందని విమర్శించారు.
ఆశించిన స్థాయిలో పని చేయడంలేదని, బలాన్ని ప్రదర్శించడం లేదని తప్పుపట్టారు. ఉత్త మాటలతో సమస్యలు పరిష్కారం అవుతాయా? యుద్ధాలు ఆగిపోతాయా? అని ట్రంప్ ప్రశ్నించడం గమనార్హం. ఘాటైన పదజాలంలో లేఖలు రాయడం తప్ప చేసిందేమైనా ఉందా? అని నిలదీశారు. ఐరాస ప్రధాన కార్యాలయానికి వస్తుండగా ఎస్కలేటర్ ఆగిపోవడం, టెలిప్రాంప్టర్ విఫలం కావడం గురించి మాట్లాడారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐరాస వేదికపై ప్రసంగించడం ఇదే తొలిసారి. డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
ఐరాస నుంచి ఫోన్ కూడా రాలేదు
‘‘అందరూ అసాధ్యం అన్నవి నేను సుసాధ్యం చేసి చూపించా. ఏడు నెలల్లో ‘ముగింపు లేని’ ఏడు యుద్ధాలు ఆపేశా. 36 ఏళ్లుగా, 31 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధాలు కూడా ఇందులో ఉన్నాయి. కాంబోడియా–థాయ్‌లాండ్, కాంగో–రువాండా, భారత్–పాకిస్తాన్, ఇజ్రాయెల్–ఇరాన్, ఈజిప్టు–ఇథియోపియా, అర్మేనియా–అజర్‌బైజాన్, కొసావో–సెర్బియా యుద్ధాలకు ముగింపు పలికేశా. దీనివల్ల వేలాది మంది ప్రాణాలు నిలిచినట్లే. ఈ ఏడాది మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య శాంతికి చొరవ తీసుకున్నా. కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించా. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పని నేను చేయాల్సి రావడం నిజంగా బాధగా ఉంది.
అసలు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏమిటి? యుద్ధాలు ఆపడానికి ఐక్యరాజ్యసమితి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. యుద్ధాల్లో మునిగి తేలుతున్న దేశాల అధినేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపా. ఆ సమయంలో ఐక్యరాజ్యసమితి నుంచి నాకు కనీసం ఫోన్‌కాల్ కూడా రాలేదు. ఐక్యరాజ్యసమితి నుంచి వచి్చంది ఏమిటయ్యా అంటే ఎస్కలేటర్ మాత్రమే. అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. నా భార్య మెలానియా ట్రంప్ చక్కటి ఆకారం(õÙప్)లో ఉంది కాబట్టి కిందపడిపోలేదు. మేమిద్దరం చక్కటి ఆకారంలో ఉన్నాం. టెలిప్రాంప్టర్ కూడా సరిగ్గా పని చేయలేదు. టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అది ఉంటే హృదయం లోతుల నుంచి మరింత ఎక్కువగా మాట్లాడొచ్చు.
రక్తపాతాన్ని ఆపేలా మా చర్యలుంటాయి
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలే నిధులు సమకూరుస్తున్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఆర్థిక బలాన్నిస్తున్నాయి. కొనుగోళ్లు ఆపాలని చెబుతున్నా మొండిగా కొనసాగిస్తున్నాయి. నాటో దేశాలు సైతం రష్యా నుంచి చమురు ఉత్పత్తులు, పలు రకాల ఇంధనాలు కొనుగోలు చేస్తుండడం క్షమించరాని విషయం. ఇది నాకు చాలా అసంతృప్తి కలిగిస్తోంది. ఏమైనా ఆలోచిస్తున్నారా? మీపై యుద్ధానికి మీరే నిధులు అందిస్తారా? ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని చెబుతున్నా రష్యా వినడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు, టారిఫ్‌లు విధించక తప్పదు.
రక్తపాతాన్ని ఆపేలా మా చర్యలుంటాయి. అవి కూడా అతిత్వరలోనే. రష్యాపై చర్యలు తీసుకొనే విషయంలో యూరప్ దేశాలు కూడా మాతో కలిసి రావాలి. ఎందుకంటే రష్యాకు యూరప్ దేశాలే దగ్గర. మాకు, రష్యాకు మధ్య సముద్రం ఉంది. ఒకవైపు రష్యాతో పోరాడుతూనే మరోవైపు అదే రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనడం సరైంది కాదు. ఇది నిజంగా కంపరం కలిగిస్తోంది. ఈ కొనుగోళ్లు తక్షణమే ఆపండి. ఇప్పటికే మనం చాలా సమయం వృథాచేశాం. యూరప్ దేశాల అధినేతలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడో ఎందుకు.. ఈ రోజే చర్చిద్దాం.

ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయాలి
ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం మాకు ఆమోదయోగ్యం కాదు. అందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోం. గాజాపై యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ బందీలందరినీ హమాస్ మిలిటెంట్లు ఇకనైనా విడుదల చేయాలి. యుద్ధం ఆగాలంటే ఇజ్రాయెల్‌తోపాటు హమాస్ ముందుకు రావాలి. నియంత్రణ లేని వలసలతో అమెరికా సహా యూరప్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి అక్రమ వలసలకు ఐక్యరాజ్యసమితి వత్తాసు పలుకుతుండటం, కొన్నిసార్లు నిధులు కూడా ఇస్తుండటం దురదృష్టకరం.
మరోవైపు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల పేరిట కొనసాగుతున్న వలసలు యూరప్ దేశాలకు మరణశాసనం రాస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం లేదా? టారిఫ్‌ల విషయంలో విదేశాలు మమ్మల్ని తప్పుపడుతున్నాయి. మా సార్వ¿ౌమత్వాన్ని కాపాడుకోవడానికే విదేశీ ఉత్పత్తులపై టారిఫ్‌లు విధిస్తున్నాం. ఇందులో మరోమాటకు తావులేదు. ఇక పునరుత్పాదక ఇంధన వనరులు ఒక జోక్. శిలాజ ఇంధనాలకు సరైన ప్రత్యామ్నాలు ఉన్నాయా? మా రాజధాని వాషింగ్టన్ డీసీ భద్రత పట్ల కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమానాలు అక్కర్లేదు. మా రాజధాని భద్రంగా ఉంది’’ అని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు.