నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. స్విట్జర్లాండ్‌లోని వాలిస్ కాంటన్ ప్రాంతంలో ఓ బార్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 40 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. న్యూ ఇయర్ వేడుకల కోసం పెద్ద సంఖ్యలో యువత బార్‌లో గుమికూడిన సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు మొత్తం భవనాన్ని చుట్టుముట్టడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.
విలేకరుల సమావేశంలో వాలిస్ కాంటన్ పోలీస్ కమాండర్ ఫ్రెడెరిక్ గిస్లెర్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాన్ని తేల్చడానికి ఇంకా సమయం పడుతుందని వాలిస్ కాంటన్ అటార్నీ జనరల్ బీట్రైస్ పిలోడ్ తెలిపారు. అయితే ఇద్దరు ఫ్రెంచ్ ప్రత్యక్ష సాక్షులు ఎమ్మా, అల్బెన్ మాట్లాడుతూ.. పైకప్పుకు చాలా దగ్గరగా ఉంచిన కొవ్వొత్తులే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని చెప్పారు. బార్‌లో షాంపైన్ సీసాలపై పుట్టినరోజు కొవ్వొత్తులు వెలిగించి పైకి ఎత్తిన సమయంలో మంటలు చెలరేగినట్లు తెలిపారు.
ఓ ఫ్రెంచ్ న్యూస్ ఛానల్ ప్రకారం.. ఒక వెయిట్రెస్ షాంపైన్ సీసాలపై కొవ్వొత్తులు ఉంచి పైకప్పు వైపు ఎత్తారు. దాంతో కొన్ని క్షణాల్లోనే మొత్తం పైకప్పు మంటల్లో చిక్కుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంతా కలప, మట్టితో చేసిన నిర్మాణం కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి అని వారు వెల్లడించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే బార్‌లో ఉన్న సుమారు 200 మంది బయటకు పరుగులు తీశారు. అయితే బయటకు వెళ్లే మార్గాలు చాలా ఇరుకుగా ఉండటం, మెట్లు మరింత సన్నగా ఉండటంతో సహాయక చర్యలు తీవ్రంగా కష్టమయ్యాయి. 30 సెకన్లలోనే 200 మంది బయటకు రావడానికి ప్రయత్నించారు. అది భయంకర దృశ్యం అని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది 16 నుంచి 26 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. వీరిలో పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఉగ్రవాద కోణం లేదని స్పష్టం
ఈ ఘటన ఉగ్రవాద దాడి కాదని, ఇది పూర్తిగా అగ్నిప్రమాదమేనని పోలీసులు స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసినట్లు తెలిపారు. అలాగే క్రాన్స్-మోంటానా ప్రాంతం పైన నో-ఫ్లై జోన్ విధించినట్లు పోలీసులు ప్రకటించారు.అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.


