
ఆయనో సీనియర్ పార్లమెంటేరియన్. చట్ట సభకు సంబంధించిన ఓ కార్యక్రమం జరుగుతోంది. ఆ ఈవెంట్‌లో పీకల దాకా తాగారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న యువ సభ్యురాలితో అనుచితంగా ప్రవర్తించారు. ఇది ఫిర్యాదు దాకా వెళ్లింది.
సీనియర్ సభ్యుడొకరు తనను బాగా ఇబ్బంది పెట్టారని ఆస్ట్రేలియా స్వతంత్ర సెనేటర్ ఫాతిమా పేమన్(Fatima Payman) ఆరోపణలకు దిగారు. ఈ మేరకు పార్లమెంటరీ వర్క్‌ప్లేస్ సపోర్ట్ సిస్టమ్(PWSS)లో ఆమె ఫిర్యాదు కూడా చేశారు. ‘‘పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన బాగా తాగారు. నన్ను కూడా తాగి.. టేబుల్ ఎక్కడి డ్యాన్స్ చేయమంటూ బలవంతం చేయబోయారు. అయితే అందుకు నేను ఒప్పుకోలేదు.
.. నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి అంటూ కటువుగానే ఆయనకు సమాధానం ఇచ్చా’’ ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. సదరు సీనియర్ సెనేటర్ పేరును ఆమె మీడియాకు ప్రస్తావించలేదు. అయితే ఆ వ్యాఖ్యలు మతపరంగా తన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు లైంగిక వేధింపుల కిందకు వస్తుందంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సత్వరమే స్పందించిన పీడబ్ల్యూఎస్ విచారణ జరుపుతామని ఆమెకు హామీ ఇచ్చింది.
అఫ్గన్ సంతతికి చెందిన ఫాతిమా(30).. 2022లో లేబర్ పార్టీ(Labour Party) తరఫున వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి ఎన్నికయ్యారు. ఆ టైంలో అతి చిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. 2024లో పాలస్తీనా తీర్మానం సమయంలో ఆమె పార్టీ వైఖరికి విరుద్ధంగా ఓటేశారు. ఈ పరిణామంతో ఆమె లేబర్ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి: ఇదేం చెండాలం?.. నడిరోడ్డు మీద డర్టీ పిక్చర్