వెనెజువెలాలో శిథిలాలు తొలగించేకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు
లా గువేరా: జంట భూకంపాలు వెనెజువెలాను చివురుటాకులా వణికించిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం 920గా ఉన్న మరణాల సంఖ్య శనివారం నాటికి ఏకంగా 1,430 దాటేసింది. మరణాల సంఖ్య విపరీతంగా పెరిగే ఆస్కారముందని సహాయక బృందాలు అంచనావేస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపడుతున్నారు. భూకంప ఘటనలో 3,238 మంది గాయపడ్డారు. కుప్పకూలిన ఒక భవనం నుంచి ఒక నవజాత శిశువును సహాయక బృందాలు విజయవంతంగా కాపాడాయి. తర్వాత శిశువు తల్లినీ జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు.
అడుగంటుతున్న ఆశలు
భూకంపాల ధాటికి బాధితులుగా మారిన వారి ఆచూకీపై గంట గంటకూ ఆశలు సన్నగిల్లుతున్నాయి. బుధవారం వెనెజువెలాలోని లా గువేరా నగరంలో సంభవించిన భూకంపం ధాటికి భారీస్థాయిలో భవనాలు ధ్వంసంకాగా వాటి శిథిలాల్లో పెద్ద సంఖ్యలో స్థానికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. శిథిలాల తొలగింపు ప్రక్రియకు తాజాగా అవరోధాలు ఎక్కువయ్యాయి. మళ్లీ భూకంపం రావొచ్చనే భయం స్థానికుల్లో పెరగడంతో ఎక్కువ మంది జనం ఇతర ప్రాంతాలకు తరలిపోవడం, రోజువారీ ట్రాఫిక్ పెరగడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
కూలిన భవనాల నుంచి వేగంగా బాధితుల జాడ కనిపెట్టే అన్వేషణ, సహాయక చర్యలకు సరిపడా సిబ్బంది కరువయ్యారు. దీంతో తమ వారి జాడ కోసం బంధువులు, కుటుంబసభ్యులు ఉత్త చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్నారు. స్థానికులు సుత్తి, డ్రిల్లింగ్ మెషీన్‌లతో సిమెంట్ శ్లాబులను పగలగొట్టి పక్కకు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా 68,900 మంది జాడ గల్లంతైందని బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ పెనువిలయానికి భారీస్థాయిలో బలై ఉంటారనివార్తలొస్తున్నాయి. భూకంపం తర్వాత శిథిలాల కింద ఉన్న వారిని 48 నుంచి 72 గంటల్లోపు రక్షించగలిగితేనే వారు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గాయపడి, రక్తమోడుతూ సాయం కోసం ఆర్తనాదాలు చేసే వాళ్లకు ఎలాగోలా కనీసం ఆహారం, నీరు అందివ్వగలిగితే బతికే అకాశాలు పెరుగుతాయని సహాయక బృందాలు చెబుతున్నాయి. మెక్సికో, అమెరికా, ఎల్ సాల్వెడార్, స్విట్జర్లాండ్, కొలంబియా తదితర దేశాల నుంచి వలంటీర్లు వచ్చి అన్వేషణ, సహాయక బృందాలకు సాయపడుతున్నారు.


