రష్యా నుంచి డీజిల్‌ కొంటాం  | USA President Donald Trump makes a deal with Russia | Sakshi
Sakshi News home page

రష్యా నుంచి డీజిల్‌ కొంటాం 

Oct 11 2026 5:44 AM | Updated on Oct 11 2026 5:44 AM

USA President Donald Trump makes a deal with Russia

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన 

ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం 

తీవ్రంగా వ్యతిరేకించిన ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ  

వాషింగ్టన్‌:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాటలకు, చర్యలకు అర్థాలే వేరు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే భారీగా సుంకాలు విధిస్తామంటూ ప్రపంచ దేశాలను బెదిరిస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన ట్రంప్‌ నేడు అదే రష్యా నుంచి చమురు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. డీజిల్‌ సరఫరా కోసం అమెరికా, రష్యా మధ్య ఈ డీల్‌ కుదిరింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌ సంభాషణ అనంతరం శుక్రవారం ట్రంప్‌ ఈ ఒప్పందాన్ని స్వయంగా ప్రకటించారు. 

రష్యా నుంచి డీజిల్‌ కొనుగోలు గురించి ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ పోస్టుచేసిన కొద్ది నిమిషాలకే.. రష్యాపై ఆంక్షలను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7 వరకు ఎత్తివేస్తూ అమెరికా ట్రెజరీ శాఖ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, ట్రంప్‌ ద్వంద్వ ప్రమాణాలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికాలో డెమోక్రటిక్‌ నాయకులు, రిపబ్లికన్లలోని ఒక వర్గం నేతలు తప్పుపట్టారు. 

రష్యా నుంచి చమురు, గ్యాస్‌ను అత్యధికంగా కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలను విధించేందుకు సెప్టెంబర్‌ 16న అమెరికా కాంగ్రెస్‌లో ఒక చట్టాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. నెల రోజుల వ్యవధిలోనే రష్యా నుంచి చమురు కొనుగోలుకు ట్రంప్‌ ఒప్పందం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ‘‘నేను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అత్యంత విజయవంతమైన చర్చను ఇప్పుడే ముగించాను. 

అమెరికాతోపాటు ప్రపంచ మార్కెట్ల కు తక్షణమే 3,00,000 టన్నులకు పైగా డీజిల్‌ను సరఫరా చేయడానికి రష్యా అంగీకరించింది. నవంబర్‌లో మరో 5,00,000 టన్నుల డీజిల్‌ను, ఆ వెంటనే మరో పది లక్షల టన్నులను సరఫరా చేస్తుంది. డీజిల్‌ రిఫైనరీల సామర్థ్యాన్ని బట్టి అదనంగా 30 లక్షల టన్నుల డీజిల్‌ను సరఫరా చేయడానికి రష్యా అంగీకరించింది’’అని ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ పోస్టుచేశారు. హార్మూజ్‌ జలసంధిపై అమెరికాకు ఉన్న నియంత్రణ, రష్యా నుంచి ప్రతిపాదిత డీజిల్‌ సరఫరాలతో ఇంధన ధరలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించారు.  

యుద్ధాన్ని పొడిగించడానికి అది పెట్టుబడి: జెలెన్‌స్కీ  
ట్రంప్‌ తాజా నిర్ణయంపై ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రష్యా నుంచి డీజిల్‌ కొనడం సరైన వ్యూహం కాదని పేర్కొన్నారు. పుతిన్‌కు ఇచ్చే బహుమతులు నాగరిక ప్రపంచానికి శాంతిని గానీ, ఇతర ప్రయోజనాన్ని గానీ చేకూర్చలేవని సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. రష్యా పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించడానికి అనుమతించడం అనేది... ముగించాల్సిన యుద్ధాన్ని మరింత పొడిగించడానికి పెట్టుబడి పెట్టడమే అవుతుందని విమర్శించారు.   

అందుకే రష్యా డీజిల్‌పై ఆసక్తి  
స్వదేశంలో చమురు ధరలు భారీగా పెరగడం వల్లే రష్యా డీజిల్‌పై ట్రంప్‌ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో శుక్రవారం నాటికి డీజిల్‌ సగటు ధర గ్యాలన్‌కు 6.28 డాలర్లుగా ఉంది. ఇది ఏడాది క్రితం 3.68 డాలర్లుగా ఉండేది. అంటే దాదాపు రెండింతలు పెరిగింది. అమెరికా నుంచి డీజిల్‌ ఎగుమతులపై నిషేధం విధించాలని గత నెలలో ట్రంప్‌ ప్రతిపాదించారు. అయితే, అటువంటి చర్య ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరతకు, తద్వారా ధరల పెరుగుదలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరించడంతో ట్రంప్‌ వెనక్కి తగ్గారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement