అమెరికా విమాన ప్రమాదం.. ఒబామా, బైడెన్‌పై ట్రంప్ సీరియస్ | USA Donald Trump Blames Obama And Biden After Plane Crash | Sakshi
Sakshi News home page

అమెరికా విమాన ప్రమాదం.. ఒబామా, బైడెన్‌పై ట్రంప్ సీరియస్

Jan 31 2025 7:04 AM | Updated on Jan 31 2025 8:59 AM

USA Donald Trump Blames Obama And Biden After Plane Crash

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్టన్‌లో ఘోర విమాన ప్రమాదం కారణంగా 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వాషింగ్టన్‌ సమీపంలో ప్యాసింజర్‌ విమానం, హెలికాప్టర్‌ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాల ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రమాదానికి గత అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జో బైడెన్‌ పాలసీ విధానాలే కారణమని కామెంట్స్‌ చేశారు.

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా విమాన ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేపడుతామని, మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో అమెరికాలో గత అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జో బైడెన్‌లు ఆకాశ భద్రతా ప్రమాణాలకు సంబంధించి రాజీపడ్డారు. కానీ, మేము మాత్రం భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఒబామా, బైడెన్‌, ఇతర డెమొక్రాట్లు తమ విధానాలకే మొదటి ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. వారు కొందరికే ప్రాధాన్యత ఇచ్చారని, మేము సమర్థులైన వారినే కావాలనుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎఫ్‌ఏఏకు తాత్కాలిక కమిషనర్‌ను నియమిస్తున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు.

ఇదే సమయంలో సుపీరియర్‌ ఇంటెలిజెన్స్‌ అవసరం అయ్యే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌లో అనర్హులను నియమించినట్లు ట్రంప్‌ విమర్శించారు. గతవారం తాను సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ ప్రమాణాల పునరుద్ధరణ సైతం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదని ప్రకటించారు. ఈ ప్రమాదం చాలా మందిని కుదిపేసిందన్నారు. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోని ప్రజలపై దీని ప్రభావం ఉందని తెలిపారు. అలాగే, ప్రమాదంలో బాధితుల కోసం నిరంతరం శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌ను అభినందించారు.

ఇక, అంతకుముందు.. బాధితులకు ట్రంప్‌ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా కాసేపు మౌనం పాటించారు. అలాగే, విమాన ప్రమాదానికి సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ఈ ప్రమాదం తనను ఎంతో వేదనకు గురిచేసిందన్నారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌లో జరిగిన సంభాషణల టేపులను తాను విన్నానని తెలిపారు. విమానం సరైన మార్గంలోనే వెళ్లిందని, పైలట్‌ తప్పిదం లేదని పేర్కొన్నారు. అయితే అదేసమయంలో హెలికాప్టర్‌ అదే ఎత్తులో ఎగిరిందని, దీంతో పెను ప్రమాదం జరిగినట్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement