ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన వైట్‌హౌస్
త్వరలో అమల్లోకి వస్తుందన్న అంచనాలు
అత్యధికంగా ఉన్నభారతీయ విద్యార్థులపై ప్రభావం
ముఖ్యంగా పీహెచ్‌డీ, పరిశోధక విభాగాల వారికి కష్టాలు
వాషింగ్టన్: భారతీయ టెక్ నిపుణులు అత్యధికంగా వినియోగించుకునే హెచ్–1బీ వంటి వీసాలపై కఠిన ఆంక్షలను తీసుకువచ్చిన అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం..విదేశీ విద్యార్థి వీసా విధానంలోనూ తీవ్ర మార్పులకు శ్రీకారం చుట్టింది. విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఉండే భారతీయ విద్యార్థులు వీటితో ఇబ్బందులు పడే అవకాశముంది. తాజా మార్పు ప్రకారం.. అంతర్జాతీయ విద్యార్థులు దేశంలో ఎంతకాలం ఉండేందుకు వీలుందో తెలియజేసే ఎక్ప్‌పైరీ తేదీని సైతం ముందుగానే నిర్ణయిస్తారు. ఇందుకు సంబంధించి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పంపిన ప్రతిపాదనపై అధ్యక్ష భవనం ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి రానుంది. దీని ప్రకారం విదేశీ విద్యార్థులు స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఇకపై గరిష్టంగా నాలుగేళ్లపాటు మాత్రమే ఉండేందుకు అవకాశముందని బ్లూమ్‌బర్గ్ పత్రిక తెలిపింది. ఎఫ్–1 స్టూడెంట్ వీసాదారులు, జె–1 ఎక్సే్ఛంజి విజిటర్ వీసాలు కలిగిన వారు, ఇతర వీసా కేటగిరీ వారు ఇందులోకి వస్తారు. ఈ మార్పు అత్యధిక సంఖ్యలో అమెరికాలో చదువులు కొనసాగించే భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. నాలుగేళ్లకు మించి కొనసాగే పీహెచ్‌డీ, పరిశోధక, ఇతర దీర్ఘకాల కోర్సుల్లో నమోదై ఉన్న భారతీయ విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశముంది. వీరి చదువు నిర్ణిత కాల పరిమితిని దాటినట్లయితే గడువు పొడిగించాలంటూ ఇమిగ్రేషన్ అధికారులను తప్పక కోరాల్సి ఉంటుంది.
డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్‌కు బదులుగా..
ప్రస్తుతమున్న ’డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానాన్ని అనుసరించి అంతర్జాతీయ విద్యార్థులు తమ విద్యా కోర్సుల్లో కొనసాగుతూ, వీసా నిబంధనలను పాటిస్తున్నంత కాలం అమెరికాలో ఉండటానికి సాధారణంగానే అనుమతి లభిస్తుంది. దీనివల్ల విద్యార్థులు తమ చదువును పొడిగించుకోవడానికి, ఒక విశ్వవిద్యాలయం నుంచి మరో విశ్వవిద్యాలయానికి మారేందుకు, కోర్సుల మార్పునకు, డిగ్రీ నుంచి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సులువుగా ఉంది. కొత్తగా ప్రవేశ అనుమతి కాలపరిమితిని కోరకుండానే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ), స్టెమ్ ఓపీటీలను పూర్తి చేయడానికి అవసరమైన వెసులుబాటు వారికి దొరికేది. తాజా నిబంధన అమలైతే ఈ పాత పద్ధతి ముగియనుంది.
బదులుగా విద్యార్థులు దేశంలో చట్టబద్ధంగా ఉండేందుకు ఇమిగ్రేషన్ విభాగం ఒక నిర్దేశిత కాలపరిమితిని మాత్రమే మంజూరు చేస్తుంది. ఈ నిబంధన ఇంకా అధికారికంగా అమల్లోకి రానప్పటికీ, ఇందుకు సంబంధించిన గత సూచనల ప్రకారం, చాలా మంది విద్యార్థులకు గరిష్టంగా నాలుగేళ్ల ప్రవేశ కాలపరిమితి మాత్రమే లభిస్తుందని అధికారులు అంటున్నారు. నాలుగేళ్ల పరిమితితో సాగే కోర్సులు చదివే విద్యార్థులు మాత్రమే దేశంలో చట్టబద్ధంగా ఉండటానికి ’యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్విసెస్’ (యూఎస్‌సీఐఎస్) నుంచి ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుంది.
ఈ ప్రక్రియలో అదనపు పత్రాల సమర్పణ, బయోమెట్రిక్ నమోదు, మరింత కఠినమైన పరిశీలన, ప్రాసెసింగ్‌లో ఆలస్యం వంటి ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈ కొత్త నిబంధన ఇప్పటికే వైట్ హౌస్‌లోని ’ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్’ సమీక్షను పూర్తి చేసుకుంది. అధికారిక ప్రచురణ, పూర్తిస్థాయి అమలుకు ముందు చివరి విధానపరమైన దశల్లో ఇదొకటి.
30 శాతం మంది భారతీయ విద్యార్థులే
ఈ మార్పు భారతీయ విద్యార్థులపై గణనీయమైన ప్రభావం చూపనుంది. అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. 2023–24 విద్యా సంవత్సరంలో అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో 3.31లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్లు ఓపెన్ డోర్స్ సంస్థ తన నివేదికలో తెలిపింది. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయుల వాటా ఏకంగా 30 శాతం వరకు ఉండటం గమనార్హం.
వీరిలో చాలా మంది విద్యార్థులు డాక్టోరల్ డిగ్రీలు, విస్తృత పరిశోధనలతో కూడిన మాస్టర్స్ ప్రోగ్రాంలు, కొన్ని రకాల ప్రొఫెషనల్ కోర్సులతో కలిపి సాధారణంగా నాలుగేళ్లకు మించి సాగే విద్యా కోర్సుల్లోనే నమోదై ఉన్నారు. కొత్త నిబంధనల ప్రకారం, వీరంతా తమ చదువును నిరంతరాయంగా కొనసాగించాలంటే అదనపు ధ్రువీకరణలను, ఇమిగ్రేషన్ అధికారుల కఠినమైన పరిశీలనను ఎదుర్కోవాల్సి రావచ్చు.
అనిశ్చితిని సృష్టిస్తుంది: ఏఏయూ
అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్ (ఏఏయూ), అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ఏసీఈ), ఎన్‌ఏఎఫ్‌ఎస్‌ఏ వంటి ప్రముఖ విద్యా సంస్థల కూటములు ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చదువు, పరిశోధనల సమయం తరచూ మారుతూ ఉండే కోర్సుల విద్యార్థుల విషయంలో నిర్దేశిత కాలపరిమితి విధానం తీవ్రమైన అనిశ్చితిని సృష్టిస్తుందని ఈ గ్రూపులు వాదిస్తున్నాయి.
అలాగే, ఇది వర్సిటీల పరిపాలనా పరమైన భారాన్ని పెంచుతుందని, సుదీర్ఘ రీసెర్చ్, పీహెచ్‌డీ కోర్సుల విద్యార్థులు చట్టబద్ధమైన హోదాను కాపాడుకోవడం మరింత కష్టతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పైపెచ్చు, విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో పని అనుభవాన్ని పొందేందుకు వీలు కల్పించే ’ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’(ఓపీటీ పైనా ప్రభావం చూపుతుంది. వీసా గడువు పొడిగింపునకు అధికారులు ఆమోదం తెలపడంలో ఏమాత్రం ఆలస్యమైనా అది విద్యార్థులు తమ చదువు ముగించుకుని ఉద్యోగంలోకి మారే ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తుంది.
గడువు ముగిస్తే అక్రమంగా ఉంటున్నట్లే
వైట్‌హౌస్ ఆమోదించిన ప్రతిపాదనల్లో మరో ఆందోళనకరమైన అంశం ఉంది. దీని ప్రకారం..విద్యార్థులకు అనుమతించిన కాలపరిమితి ముగిసిన వెంటనే వారు దేశం విడిచి వెళ్లిపోవడం తప్పనిసరి. లేకుంటే దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లే లెక్క. ప్రభుత్వ విభాగాల్లో పరిపాలనాపరమైన ఆలస్యం, దరఖాస్తుల పెండింగ్, ఇతర చిన్నపాటి పొరపాట్ల వల్ల విద్యార్థులు ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల, జరిమానాలను చెల్లించాల్సి రావడంతోపాటు భవిష్యత్తులో అమెరికాకు తిరిగి రాకుండా ప్రయాణ ఆంక్షలు వంటి కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి రావచ్చు.
గతంలోనే తెచ్చినా అమలు కాలేదు
హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ ప్రతిపాదనను మొదటగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి పదవీకాలంలోనే తీసుకువచ్చింది. కానీ, అప్పట్లో ఇది అమలు కాలేదు. ట్రంప్ మళ్లీ బాధ్యతలు చేపట్టాక ఈ ఆలోచనను 2025లో మళ్లీ తెరపైకి తెచ్చారు. ఇప్పుడు వైట్ హౌస్ ఆమోదం కూడా లభించడంతో, ఇది త్వరలోనే అధికారిక విధానంగా మారేందుకు అవకాశమేర్పడింది. ప్రస్తుతానికి పాత నిబంధనల్లో ఎలాంటి మార్పూ లేదు. అంతర్జాతీయ విద్యార్థులు ప్రస్తుత డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంలో భాగంగానే అమెరికాలో కొనసాగవచ్చు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే గత కొన్ని దశాబ్దాలలో యూఎస్ స్టూడెంట్ వీసా వ్యవస్థలో వచ్చిన అతిపెద్ద మార్పుల్లో ఒకటిగా నిలుస్తుంది.


