వాషింగ్టన్: 40 రోజులకు చేరిన అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ముగింపు దశకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. రిపబ్లికన్‌ల డిమాండ్ ప్రకారం ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలపై ఓటింగ్‌కు హామీ ఇస్తే.. జనవరి చివరి వరకు నిధులను పొడిగించేందుకు మితవాద డెమొక్రాట్‌ల బృందం తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైంది.
సెనేటర్లు జీన్ షాహీన్, మాగీ హసన్, అంగస్ కింగ్ నేతృత్వంలోని బృందం చేసిన ప్రతిపాదనతో విమానాల రద్దు, ఆహార సహాయం నిలిపివేత, ఫెడరల్ కార్మికుల జీతాల కొరత తదితర తీవ్ర పరిణామాలకు అడ్డుకట్ట పడగలదని ఆశిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అమెరికా షట్‌డౌన్ ముగింపునకు దగ్గరగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఒప్పందంపై డెమొక్రాటిక్ పార్టీలో తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతోంది. సెనేట్ డెమొక్రాటిక్ నేత చక్ షుమెర్, సెనేటర్ బెర్నీ సాండర్స్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అఫర్డబుల్ కేర్ చట్టం (ఏసీఏ) కింద ఆరోగ్య సబ్సిడీల పొడిగింపు అనే ప్రధాన డిమాండ్‌ను పక్కన పెట్టడం అంటే ట్రంప్‌నకు లొంగిపోవడమే అని సాండర్స్ పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించకుండా ఒప్పందం చేసుకోవడం లక్షలాది మందికి చేసే ద్రోహం అని హౌస్ ప్రోగ్రెసివ్ నాయకులు విమర్శించారు. ఈ అంతర్గత విభేదాల కారణంగా, ఒప్పందం ఆమోదం పొందడానికి జాప్యం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఈ షట్‌డౌన్ అమెరికా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 2,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. లక్షలాది మందికి అవసరమైన ఆహార సహాయం (ఎస్‌ఏపీ) అందడంలో ఆలస్యం అవుతోంది. వర్జీనియా వంటి ప్రాంతాలలో లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతుండటంతో, స్థానిక ఫుడ్ బ్యాంక్‌లపై భారం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, వర్జీనియా సెనేటర్ టిమ్ కైన్ వంటి కొందరు డెమొక్రాట్లు ఫెడరల్ శ్రామిక శక్తిని, ప్రభుత్వ కార్యకలాపాలను రక్షించేందుకు ఈ ఒప్పందానికి మద్దతు ఇస్తున్నారు.
కాగా ప్రభుత్వ ఫట్‌డౌన్‌ను ఎత్తివేడానికి రిపబ్లికన్లకు కేవలం ఐదుగురు డెమొక్రాట్‌ల మద్దతు మాత్రమే అవసరం. అయినప్పటికీ, హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ఏసీఏ సబ్సిడీలపై భవిష్యత్తులో ఓటు వేస్తామనే హామీకి కట్టుబడి ఉండకపోవచ్చని వస్తున్న వార్తలు.. ఒప్పందంపై అనుమానాలను పెంచుతున్నాయి. డెమొక్రాట్ల మధ్య చీలిక ఏర్పడటం, రిపబ్లికన్‌ల తుది హామీపైనే ఈ షట్‌డౌన్ ముగింపు ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: ‘శ్వాస చంపేస్తోంది’.. ఢిల్లీలో భారీ నిరసనలు


