లండన్: బ్రిటన్‌లో ఉద్యోగాలు పొందేందుకు నకిలీ పాస్‌పోర్టులు, వీసా పత్రాలు, స్పాన్సర్‌షిప్ సర్టిఫికెట్లు ఉపయోగించినందుకు వేలాది మందిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల నిర్వహించిన వరుస ఇమ్మిగ్రేషన్ దాడుల్లో భారీగా నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్న హోం ఆఫీస్, దేశ చరిత్రలోనే అతిపెద్ద డాక్యుమెంట్ చెక్‌ను ప్రారంభించింది.
యూకేలో ఉద్యోగాలు పొందేందుకు మోసగాళ్లు ప్రధానంగా మూడు మార్గాల్లో నకిలీ పత్రాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS) మోసం
స్పాన్సర్‌షిప్ లైసెన్స్ లేని కంపెనీల పేరుతో నకిలీ ‘సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్’లు (CoS) జారీ చేస్తూ కొన్ని గుంపులు భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేస్తున్నాయి.
షేర్ కోడ్ మోసం
ప్రత్యేకంగా కేర్ సెక్టార్‌లో షేర్ కోడ్ కుంభకోణాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. షేర్ కోడ్ అనేది ఒక వ్యక్తికి యూకేలో పని చేసే అర్హత ఉందో లేదో నిర్ధారించే ఆన్‌లైన్ విధానం. ఇతరుల వివరాలను ఉపయోగించడం లేదా సాంకేతికంగా మార్చడం ద్వారా నకిలీ షేర్ కోడ్‌లను సృష్టించే ధోరణి పెరుగుతోంది.
బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ (BRP) మోసం
దొంగిలించబడిన లేదా గడువు ముగిసిన BRP కార్డులలో ఫోటోలు, వ్యక్తిగత సమాచారాన్ని మార్చి కొత్త పత్రాలు తయారు చేయడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.
అలాగే, హెల్త్ అండ్ కేర్ వీసాలను దుర్వినియోగం చేస్తూ వేలాది మంది దేశంలోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ఏజెన్సీలు ఒక వ్యక్తికి జారీ చేసిన స్పాన్సర్‌షిప్ పత్రాలతో ఒకరికి మించి ఉద్యోగులను నియమిస్తున్నాయని కూడా ఫిర్యాదులు అందాయి. ఇలాంటి నకిలీ పత్రాలు అందించి అభ్యర్థులను మోసం చేసిన సంస్థల స్పాన్సర్ లైసెన్సులను రద్దు చేసే ప్రక్రియను హోం ఆఫీస్ ప్రారంభించింది.
చట్టవిరుద్ధంగా ఉద్యోగులను నియమించే సంస్థలపై బ్రిటన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మొదటిసారి పట్టుబడిన సంస్థలకు ఒక్కో అక్రమ కార్మికుడికి 45,000 పౌండ్లు (సుమారు రూ.48 లక్షలు) వరకు జరిమానా విధించవచ్చు. రెండోసారి నేరం రుజువైతే ఈ మొత్తం 60,000 పౌండ్లు వరకు పెరుగుతుంది. కార్మికులు నకిలీ పత్రాలు సమర్పించినట్లు తేలితే, వారిని వెంటనే అదుపులోకి తీసుకుని బహిష్కరణ చర్యలు ప్రారంభిస్తారు.
హోం ఆఫీస్ ప్రవేశపెట్టిన కొత్త డిజిటల్ వ్యవస్థలతో నకిలీ పత్రాలను గుర్తించడం మరింత సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. 2029 నాటికి డిజిటల్ ఐడీలను తప్పనిసరి చేయడం ద్వారా ఇలాంటి మోసాలను పూర్తిగా నిర్మూలించాలని బ్రిటన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


