'ఇరాన్‌ను లేకుండా చేస్తాం'.. 'నరకం చూపిస్తాం'! | Trump Warns Tehran Retorts Talks Resume | Sakshi
Sakshi News home page

'ఇరాన్‌ను లేకుండా చేస్తాం'.. 'నరకం చూపిస్తాం'!

Jun 29 2026 7:03 AM | Updated on Jun 29 2026 11:09 AM

Trump Warns Tehran Retorts Talks Resume

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే.. ఇరు దేశాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. హర్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌పై దాడి జరిగిందని ఆరోపిస్తూ అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిగా అమెరికా గల్ఫ్‌ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. 

హర్ముజ్‌ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న పనామా జెండా కలిగిన కికు (KIKU) అనే చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ డ్రోన్‌తో దాడి చేసిందని అమెరికా ఆరోపించింది. సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును తీసుకెళ్తున్న ఈ నౌక దెబ్బతిన్నప్పటికీ సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. దీనికి ప్రతిగా అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (CENTCOM) ఇరాన్‌లోని 10 కీలక సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. 

నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్‌ నిల్వ కేంద్రాలు, సముద్ర మైన్లను మోహరించే సామర్థ్యాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశం ఇచ్చినా.. ఇరాన్‌ మళ్లీ దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపించింది. 

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విరమణను ఇరాన్‌ పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపించిన ఆయన, అవసరమైతే అమెరికా యుద్ధాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి వస్తే.. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ అనే దేశమే ఇక ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ట్రంప్‌ హెచ్చరికలకు ఇరాన్‌ కూడా అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చింది. హర్ముజ్‌ జలసంధిపై నియంత్రణ పూర్తిగా తమదేనని మరోసారి స్పష్టం చేసిన ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఖ్చీ.. తమ నిబంధనలను ఉల్లంఘించే నౌకలు ఉద్రిక్తతలకు కారణమవుతాయని హెచ్చరించారు. అదే సమయంలో, గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు త్వరలోనే నరకాన్ని అనుభవిస్తాయి అని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ నేవీ కమాండర్‌ హెచ్చరించారు. 

మరోవైపు పశ్చిమాసియాలో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్‌, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించింది. కువైట్‌లోని అలీ అల్‌ సలేం ఎయిర్‌బేస్‌, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే కువైట్‌ సైన్యం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంటున్నాయని తెలిపింది. గల్ఫ్‌ దేశాల్లో సైరన్లు మోగించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

అయితే తీవ్ర సైనిక ఉద్రిక్తతల మధ్య కూడా దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్విట్జర్లాండ్‌లో శాంతి చర్చలపై అవగాహన ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ దాడులతో.. 60 రోజుల వ్యవధిలో శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. అయితే.. మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్‌, పాకిస్తాన్‌ల విజ్ఞప్తితో అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు చర్చలకు ముందుకొచ్చినట్లు సమాచారం అందుతోంది. 

మంగళవారం లేదంటే ఈ వారంలోనే దోహాలో సమావేశమై హర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర భద్రత, కాల్పుల విరమణ అమలుపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు సఫలమైతే ప్రాంతంలో యుద్ధ ముప్పు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. మరోవైపు ఇరు దేశాల నుంచి వస్తున్న హెచ్చరికలు మధ్యప్రాచ్యాన్ని మరోసారి అగ్నిగుండంలా మార్చే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement