
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ విరమణ అనంతరం పలు వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇరాన్ మరోమారు హెచ్చరించింది. అధ్యక్షుడు ట్రంప్ నిజంగా తమతో ఒక ఒప్పందానికి రావాలనుకుంటే, ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ విషయంలో అగౌరవ, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలను చేయకూడదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ నేత ఖమేనీపై చేసిన వ్యాఖ్యలను అబ్బాస్ అరఘ్చి ఖండించారు. ట్రంప్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో నిజాయితీ వ్యవహరించాలనుకుంటే ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ విషయంలో అగౌరవంగా మాట్లాడకూడదన్నారు. ట్రంప్ తన అనుచిత వ్యాఖ్యలతో ఖమేనీ అభిమానులు, మద్దతుదారులను బాధపెడుతున్నారని అబ్బాస్ అరఘ్చి ఆరోపించారు.
ఇరాన్ క్షిపణులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అమెరికాను ఆశ్రయించిందని, ఇంతకుమించి ఆ దేశానికి మరో మార్గం లేదని అబ్బాస్ అరఘ్చి వ్యాఖ్యానించారు. ఇరానియన్ ప్రజలు.. బెదిరింపులు, అవమానాలకు లొంగిపోరని విదేశాంగ మంత్రి అన్నారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనిని హత్య నుండి రక్షించానని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్న దరమిలా అబ్బాస్ అరఘ్చి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమతో చర్చలకు తిరిగి రావాలని ట్రంప్ కోరారు. అయితే అమెరికాతో అణు చర్చలను తిరిగి ప్రారంభించేదిలేదని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: ‘శశి థరూర్.. ఒవైసీ వేరుకాదు’: జావేద్ అక్తర్