‘శశి థరూర్‌.. ఒవైసీ వేరుకాదు’: జావేద్‌ అక్తర్‌ | Javed Akhtar Says Shahsi Tharoor And Owaisi Are Not Different, More Details Inside | Sakshi
Sakshi News home page

‘శశి థరూర్‌.. ఒవైసీ వేరుకాదు’: జావేద్‌ అక్తర్‌

Jun 28 2025 7:43 AM | Updated on Jun 28 2025 10:09 AM

Tharoor and Owaisi are no different Javed Akhtar

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రభుత్వంపై జరిగిన దాడి కాదని, యావత్‌ దేశంపై జరిగిన దాడి అని ప్రముఖ గీత రచయిత, స్క్రిప్ట్‌ రైటర్‌ జావేద్‌ అక్తర్ పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’పై ప్రపంచదేశాలకు వివరించేందుకు ప్రతిపక్ష సభ్యుల బృందం వివిధ దేశాల్లో పర్యటనలు సాగిస్తోంది.

ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో గీత రచయిత జావేద్‌ అక్తర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన  విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాంగ్రెస్ నేత శశి థరూర్, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వంటి నాయకులను ప్రభుత్వం ఈ ప్రతినిధుల బృందంలో చేర్చడం సరైనదేనా? అని అడిగినప్పుడు, ఆయన మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్ర దాడి ప్రభుత్వంపై జరిగిన దాడి కాదని,  దేశంపై జరిగిన దాడి అని అన్నారు.  అందుకే దేశంలోని అన్నివర్గాల ప్రతినిధులూ వెళ్లారన్నారు. వీరిలోని కొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారని. కానీ దేశం విషయానికి వస్తే, అందరం ఒకటేనని అన్నారు. ఈ విధంగా చూస్తే ప్రతినిధుల బృందంలోని శశిథరూర్‌, అసదుద్దీన్‌ ఒ‍వైసీ వేరుకాదని జావేద్‌ అక్తర్‌ పేర్కొన్నారు.

శశి థరూర్ అన్ని విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడతారని,ఇలాంటి కాంగ్రెస్ నేత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం సంతోషంగా ఉందని, ఆయనకు ఐక్యరాజ్యసమితిలో దౌత్య అనుభవం ఉందని అక్తర్ పేర్కొన్నారు. భారత్‌- పాకిస్తాన్ మధ్య సంబంధం గురించి ఆయన మాట్లాడుతూ 1965 యుద్ధం.. అనంతరం జరిగిన కార్గిల్ యుద్ధం నాటి నుంచి కూడా వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయన్నారు. అయితే పాక్‌ ప్రభుత్వం ఇటువంటి వివాదాల్లో తన ప్రమేయం లేదని చెబుతూ వస్తున్నదన్నారు. పహల్గామ్‌ దాడి వారు చేసినదేనని అక్తర్‌ పేర్కొన్నారు.

పాకిస్తాన్‌లోని కోట్లాది మంది భారతదేశంతో స్నేహాన్ని కోరుకుంటున్నారని, అలాగే అక్కడి యువత భారతదేశానికి వచ్చి, వినోద పరిశ్రమతో పాటు కార్పొరేట్ రంగంలో పనిచేయాలని కోరుకుంటున్నారని జావేద్‌ అక్తర్‌ పేర్కొన్నారు. అయితే అక్కడి సైనిక పాలకులకు ఇది నచ్చిన అంశమన్నారు. పాక్‌లో సైన్యం ఆధిపత్యం తెలుసుకున్న మీదటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాక్‌ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్‌ను ఆహ్వానించారన్నారు. పాక్‌లో ప్రజాస్వామ్యం ఒక బూటకమని, సైన్యమే ఆ దేశాన్ని పాలిస్తుందని జావేద్‌ అక్తర్‌ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: అభినందన్‌ను బంధించానన్న.. పాక్‌ ఆర్మీ అధికారి మృతి

Advertisement
 
Advertisement
Advertisement