అభినందన్‌ను బంధించానన్న.. పాక్‌ ఆర్మీ అధికారి మృతి | Pak Major Abbas Encounter, Who Claimed to Capture Abhinandan | Sakshi
Sakshi News home page

అభినందన్‌ను బంధించానన్న.. పాక్‌ ఆర్మీ అధికారి మృతి

Jun 25 2025 12:13 PM | Updated on Jun 25 2025 12:25 PM

Pak Major Abbas Encounter, Who Claimed to Capture Abhinandan

న్యూఢిల్లీ: నాటి పుల్వామా ఉగ్రవాద దాడి(2019) తదనంతర పరిణామాలలో అప్పటి భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్  నేషనల్‌ హీరోగా అందరి అభినందనలు అందుకున్నారు. అప్పట్లో ఆయనను బంధించానని చెప్పుకున్న పాకిస్తాన్ అధికారి మేజర్ మోయిజ్ అబ్బాస్ తాజాగా పాక్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు.

పాకిస్తాన్ సైన్యంలో మేజర్‌గా పనిచేస్తున్న మోయిజ్ అబ్బాస్ షా(37)దక్షిణ వజీరిస్తాన్‌లో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)తో జరిగిన కాల్పుల్లో మృతిచెందాడు. ఈయన ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్‌ఎస్‌జీ)లో పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ సైన్యం విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం లాన్స్ నాయక్ జిబ్రానుల్లాతో కలిసి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తున్న అబ్బాస్‌ షా కాల్పుల్లో మృతిచెందాడు.

ఒకప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి అండగా నిలిచిన టీటీపీ ఇప్పుడు  పాక్‌ భద్రతా సిబ్బంది, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతూ ప్రభుత్వానికే ముప్పుగా పరిణమించింది. 2019లో బాలకోట్ వైమానిక దాడుల తర్వాత ప్రతీకార వైమానిక ఆపరేషన్‌లో పాల్గొన్న అభినందన్ మిగ్‌ 21 బైసన్ జెట్‌ను నడుపుతూ, పాకిస్తాన్ వైమానిక దళ జెట్‌లతో తలపడ్డాడు. అయితే అభినందన్‌ విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో అభినందన్‌ను  పాకిస్తాన్ సైన్యం పట్టుకుంది.

ఇది కూడా చదవండి: అగ్నిపర్వతంలో అదృశ్యం.. విగతజీవిగా పర్యాటకురాలు

Advertisement
 
Advertisement
Advertisement