దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భారత భద్రతా దళాలు భారీ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ నిర్వహించాయి. గత 5 రోజులుగా కొనసాగుతున్న కౌంటర్ టెర్రరిజమ్ ఆపరేషన్‌లో లష్కరే తోయిబా (LeT) టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని జరగబోయే ఒక పెద్ద ఉగ్రవాద దాడిని భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా జూలై 3న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), ఆర్మీ , సీఆర్‌పీఎఫ్ (CRPF) సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. షోపియాన్ లోని మీమందర్, ఛాన్‌పోరా పరిసర ప్రాంతాల్లోని ఏడు గ్రామాలలో ఈ గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా దళాలు ఉగ్రవాదులు దాక్కున్న చోటికి చేరుకుంటున్న తరుణంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జాకీర్ మరణించాడు.

కొనసాగుతున్న గాలింపు చర్యలు
జాకిర్‌తో పాటు ఉన్న అతని సహచర ఉగ్రవాది లతీఫ్ ఇంకా ఆ ప్రాంతంలోనే దాక్కుని ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అతనిని పట్టుకోవడానికి లేదా మట్టుబెట్టడానికి భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు మరింత తీవ్రం చేశాయి. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుండి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
You Can Run But You Can't Hide !
One Lashkar terrorist neutralised by SOG Shopian, in a Jt Op, along with RR and CRPF.— J&K Police (@JmuKmrPolice) July 8, 2026
ఆ ప్రాంతంలోని దట్టమైన ఆపిల్ తోటల వల్ల ఉగ్రవాదులకు సహజమైన రక్షణ దొరికినప్పటికీ, భద్రతా దళాలు సీసీటీవీ విజువల్స్ మరియు ఆధునిక నిఘా సాంకేతికతను ఉపయోగించి వారి కదలికలను గుర్తించాయి. రాత్రి వేళల్లో కూడా ప్రత్యేక లైట్ల ద్వారా నిఘా ఉంచి ఉగ్రవాదులు తప్పించుకునే మార్గాలను మూసివేశారు.
ఈ ఆపరేషన్ విజయంపై జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఎక్స్ వేదికగా "ఇది వివిధ భద్రతా సంస్థల సమన్వయం, ఖచ్చితమైన నిఘా మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి దక్కిన ఫలితం" అన్నారు. "మీరు పరుగెత్తగలరు, కానీ దాక్కోలేరు" అని రాశారు. ఆపరేషన్ తీవ్రత దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ స్వయంగా షోపియాన్‌కు చేరుకుని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ఎవరీ జాకీర్ గనాయ్
26 ఏళ్ల జాకిర్ కుల్గామ్ నివాసి. ఎనిమిదో తరగతి వరకు చదువుకుని సెంటరింగ్ పనులు చేసేవాడు. సెప్టెంబర్ 2023లో పని కోసం ఇల్లు వదిలి వెళ్లి, ఆ తర్వాత లష్కర్ అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) లో చేరి కమాండర్‌గా మారాడు. ఇతనిపై ఉపా (UAPA) చట్టం కింద కేసులు కూడా ఉన్నాయి.


