అగ్నిపర్వతం నుంచి జారిపడి.. విగతజీవిగా పర్యాటకురాలు | Brazilian Hiker Found Dead After Falling off Indonesian Volcano | Sakshi
Sakshi News home page

అగ్నిపర్వతం నుంచి జారిపడి.. విగతజీవిగా పర్యాటకురాలు

Jun 25 2025 11:36 AM | Updated on Jun 25 2025 1:10 PM

Brazilian Hiker Found Dead After Falling off Indonesian Volcano

యువ పర్యాటకురాలి కథ విషాదాంతంగా మారింది.  అగ్నిపర్వతం నుంచి జారిపోయిన బ్రెజిలియన్ హైకర్ జూలియానా మారిన్స్.. చివరకు విగతజీవిగా రెస్క్యూ సిబ్బందికి కనిపించారు. ట్రెక్కింగ్ చేస్తున్న మార్సిన్స్‌ కొండపై నుండి పడి  మృతిచెందారని, ఆమె కుటుంబ సభ్యులు, అధికారులు ధృవీకరించారు.

జూలియానా మారిన్స్ అగ్నిపర్వతంలో పడిపోయిన తర్వాత నాలుగు రోజుల పాటు ఆమె నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. ఇండోనేషియా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 26 ఏళ్ల మారిన్స్ శనివారం ఉదయం మౌంట్ రింజానిపై తన స్నేహితుల బృందంతో పాటు  ట్రెక్కింగ్ చేస్తున్నారు. అయితే ఆమె కొండ అంచు నుంచి 490 అడుగుల లోయలో జారిపడి పడిపోయారు. ఇండోనేషియాలోని లాంబాక్ ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం 12 వేల అడుగులకు  మించిన ఎత్తులో ఉంది. ఇది ఆగ్నేయాసియా ద్వీపసమూహంలో ప్రముఖ పర్యాటక ప్రదేశంగానూ పేరొందింది.

గునుంగ్ రింజాని నేషనల్ పార్క్ తెలిపిన వివరాల ప్రకారం మారిన్స్ శిఖరాగ్రానికి చేరుకుంటూ, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో పడిపోయింది. తరువాత అందిన డ్రోన్ ఫుటేజ్‌లో ఆమె బతికే ఉందని వెల్లడైంది. అయితే, అగ్నిపర్వతాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు, ఇతర అననుకూల పరిస్థితుల నేపధ్యంలో రెస్క్యూ సిబ్బంది ఆమెను చేరుకోలేకపోయాయి. ఇసుక మధ్యలో చిక్కుకున్న ఆమెను తాళ్లతో బయటకు లాగేందుకు చేసిన ప్రయత్నం సవాలుగా మారిందని స్థానిక  అధికారులు తెలిపారు.

నాలుగు రోజుల ప్రయత్నాల అనంతరం ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ బృందాలు బ్రెజిలియన్ పర్యాటకురాలి మృతదేహాన్ని వెలికితీశాయని బ్రెజిలియన్ ప్రభుత్వం వెల్లడించింది. జూలియానా మారిన్స్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మౌంట్ రింజాని ఇండోనేషియాలో రెండవ ఎత్తయిన అగ్నిపర్వతం. గత నెలలో ఒక మలేషియా సందర్శకుడు ఇదే ప్రాంతంలో మృతిచెందాడు. గతంలో పలువురు అక్కడ హైకింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ అగ్నిపర్వతాన్ని సందర్శించేందుకు తరలివస్తుంటారు. 

ఇది కూడా చదవండి: ‘ఎమర్జెన్సీ రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌’.. గతం గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ

Advertisement
 
Advertisement
Advertisement