తాడుకట్టడం మర్చిపోయి యువతిని లోయలోకి తోసివేస్తున్న నిర్వాహకులు
బంగీ జంప్‌లో విషాదం
130 అడుగుల లోయలో పడి మహిళ దుర్మరణం
సావో పావ్‌లో(బ్రెజిల్): అంతెత్తు నుంచి స్వేచ్ఛగా కిందకు పడిపోతూ ఆఖరి నిమిషంలో మళ్లీ తాడు సాయంతో పైకి ఎగసిపడే సాహసక్రీడ ‘బంగీ జంప్’అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇష్టపడతారు. తానూ ఓసారి బంగీ జంప్ చేసి సాహసం పూర్తిచేద్దామనుకున్న ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. బంగీ జంప్ నిర్వాహకుల దారుణమైన నిర్లక్ష్యం కారణంగా ఆమె నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జంప్ చేసే వాళ్లకు ఏకైక ప్రాణాధారమైన తాడును ఆమెకు కట్టడం మర్చిపోయి అలాగే తోసేసి చివరకు ప్రాణాలుతోడేశారు.
బ్రెజిల్‌లోని సావో పావ్‌లో రాష్ట్రంలోని లైమేరియా నగర పరిధిలోని ప్రఖ్యాత స్కెలెటన్ వంతెన మీద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మారియా ఎడ్యువార్డా రోడ్రిగిస్ డీ ఫ్రిటాస్ అనే 21 ఏళ్ల అమ్మాయి శనివారం స్కెలెటన్ వంతెన వద్దకు బంగీజంప్ చేసేందుకు వచ్చింది. టికెట్ కొని సంబంధిత మణికట్టు బ్యాండ్ ఫొటోలను తన ‘ఇన్‌స్టా గ్రామ్’ఖాతాలో పోస్ట్‌చేసింది. ‘‘130 అడుగుల లోతున్న లోయలోకి అందరూ దూకుతున్నారు. నువ్వు కూడా దూకాలా ? అని ఒకరు అడిగారు. అయినా సరే దూకేస్తా’’అని ఘటనకు కొన్ని సెకన్ల ముందు తన ఖాతాలో ఆమె ఒక పోస్ట్‌చేశారు.
తర్వాత బంగీజంప్ సాహసక్రీడను నిర్వహించే ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈమెను తమ చేతులతో పైకెత్తి వంతెన మీద నుంచి అమాంతం లోయలోకి పడేశారు. అయితే ఇదంతా దూరం నుంచి చూస్తున్న కొందరు హఠాత్తుగా అరవడం మొదలెట్టారు. ‘‘ఆమెకు సేఫ్టీ తాడును కట్టలేదు. కాపాడండి’’అని అరవడం మొదలెట్టారు. దీంతో నిర్వాహకులు హతాశులయ్యారు.
వెంటనే సహాయక సిబ్బంది వంతెన కిందకు దిగి అప్పటికే కిందపడిపోయిన అమ్మాయిని హుటాహుటిన సమీప లీగల్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పుడు ఆ యువతి ప్రియుడు సైతం అక్కడే ఉన్నాడు. ఆమె ఎలాంటి రక్షణలేకుండా పడిపోవడం చూసి అతను స్పృహతప్పాడు. సేఫ్టీ తాడును ఆమెకు కట్టని ఘటనలో ఆరుగురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంగీజంప్ క్రీడ నిర్వహణలో ఏమేరకు భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నారో తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనతో నగర మేయర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.


