ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం  | Three hikers dead In Indonesia volcano eruption | Sakshi
Sakshi News home page

ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం 

May 9 2026 12:29 AM | Updated on May 9 2026 12:29 AM

Three hikers dead In Indonesia volcano eruption

ముగ్గురు పర్వతారోహకులు మృత్యువాత 

మరికొందరు గల్లంతు 

జకార్తా: ఇండోనేసియాలోని మారుమూల దీవి హల్మహెరాలో ఉన్న డుకొనొ అగ్ని పర్వతం అకస్మాత్తుగా బద్దలైన ఘటనలో ముగ్గురు పర్వతారోహకులు చనిపోయారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండోనేసియాలోని అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న అగ్నిపర్వతాల్లో డుకొనొ ఒకటి. దీనిని అధిరోహించడం ప్రమాదకరమంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కూడా. 

అయినప్పటికీ గురువారం విదేశీయులు సహా 20 మంది పర్వతారోహకులు 1,335 మీటర్ల ఎత్తయిన డుకొనొ అగ్ని పర్వతాన్ని అధిరోహించేందుకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం 7.41 గంటల సమయంలో అగ్ని పర్వతం బద్దలైంది. ఇది 16 నిమిషాలపాటు కొనసాగింది. దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తులో చిక్కని బూడిద గాలిలోకి ఎగజిమ్మింది. పర్వతారోహకుల నుంచి అత్యవసర సందేశం అందడంతో సహాయక సిబ్బంది అక్కడికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. 

అప్పటికే సింగపూర్‌ వాసులు ఇద్దరు, ఇండోనేసియా వాసి ఒకరు చనిపోయారు. శుక్రవారం మధ్యాహ్ననికి ఏడుగురు విదేశీయులు సహా 14 మందిని సురక్షితంగా కిందికి తీసుకువచ్చారు. వీరిలో ఐదుగురు గాయాలపాలయ్యారు. కిందికి దిగే క్రమంలో గల్లంతైన మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు. ఆ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు ఉండటంతో మృతదేహాలను తరలించ లేకపోయారు. డుకొనొ అగ్ని పర్వతం చుట్టుపక్కల నాలుగు కిలోమీటర్ల మేర నిషిద్ధ ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వీడియోల కోసం కొందరు పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్తున్నారని అధికారులు అంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement