వాషింగ్టన్: రెండు దశాబ్దాల క్రితం అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాడిన అల్ ఖైదా మిలిటెంట్ అహ్మద్ అల్–షరా(Ahmed al-Sharaa) వైట్‌హౌస్‌లో సోమవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమవబోతున్నారు. 1946లో స్వాతంత్య్రం పొందాక ఆధునిక సిరియా అధ్యక్షుడొకరు వాషింగ్టన్ రావడం ఇదే మొదటిసారి. ఈ కీలక భేటీ కోసం ఆయన శనివారమే అమెరికా చేరుకున్నారు. సిరియాపై ఉన్న ఆంక్షల పూర్తిగా తొలగింపు, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికా నాయకత్వంలోని అంతర్జాతీయ కూటమిలో అధికారికంగా చేరడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
తిరుగుబాటు నేత నుంచి అధ్యక్షుడి దాకా
అల్ షరా నాయకత్వంలోని తిరుగుబాటు దళాలు గత డిసెంబర్‌లో బషర్ అసద్‌ను గద్దెదించాయి. అంతకుమునుపు, అల్ ఖైదా నేతగా ఉన్న అల్ షరా సిరియాలోని అమెరికా బలగాలతో తలపడ్డారు. ఆయన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. ఆయన తలపై రివార్డును కూడా ఉంది. కొంతకాలం అమెరికా బలగాల నిర్బంధంలోనూ ఆయన ఉన్నారు. ఇంతలోనే చకచకా అనూహ్య పరిణామాలు సంభవించాయి. అల్ ఖైదాతో సంబంధాలు తెంచుకున్న అల్ షరా, తాజాగా అంతర్యుద్ధం కారణంగా సిరియాను దూరం పెట్టిన ప్రపంచ దేశాలతో సంబంధాలను తిరిగి నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో, మేలో సౌదీ అరేబియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. దీని తర్వాతే ట్రంప్ దశాబ్దాలుగా సిరియాపై కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేస్తామని ప్రకటించారు. సోమవారం వాషింగ్టన్‌లో ఆయన ట్రంప్‌తో మళ్లీ భేటీ కానున్నారు. ట్రంప్‌తో జరిగే చర్చల్లో అల్–షరా ప్రధానంగా సీజర్ చట్టం రద్దు కోసం ఒత్తిడి చేయనున్నారు. గత అసద్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ అమెరికా ఈ చట్టం కింద తీవ్ర ఆంక్షలను విధించింది.


