ట్రంప్‌నకు షాక్.. H-1B వీసా ఫీజుపై కోర్టు కీలక తీర్పు! | Trump Faces Setback as Court Strikes Down H 1B Visa Fee Hike | Sakshi
Sakshi News home page

ట్రంప్‌నకు షాక్.. H-1B వీసా ఫీజుపై కోర్టు కీలక తీర్పు!

Jun 9 2026 4:03 AM | Updated on Jun 9 2026 6:55 AM

Trump Faces Setback as Court Strikes Down H 1B Visa Fee Hike

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో పరాభవం ఎదురైంది. తీసుకున్న H-1B వీసాలపై 1,00,000 డాలర్ల ఫీజు విధించాలన్న నిర్ణయం చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. 

అమెరికా రాజ్యాంగం ప్రకారం.. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌కే ఉందని, అధ్యక్షుడికి అలాంటి అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కారణం చేత ట్రంప్ నిర్ణయాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ కేసు 20 మంది డెమోక్రటిక్ స్టేట్ అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా విచారణకు వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఈ అధిక ఫీజు విధానం వల్ల H-1B వీసా దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని కూడా డేటా చూపించింది. బోస్టన్‌లోని అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ ఈ ఫీజును 'కాంగ్రెస్ అనుమతి లేకుండా విధించిన పన్ను'గా పేర్కొన్నారు.

ప్రతి ఏటా ఇచ్చే వీసాలు
సాధారణంగా H-1B ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం సుమారు 65,000 వీసాలను ఇస్తుంది. అదనంగా మాస్టర్స్ లేదా ఉన్నత విద్యార్హతలు ఉన్నవారికి మరో 20,000 వీసాలు లభిస్తాయి. ఇప్పటి వరకు ఈ వీసాలకు కంపెనీలు చెల్లించే ఫీజు సుమారు 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల వరకు మాత్రమే ఉండేది. కానీ.. కొత్తగా ప్రతిపాదించిన 1,00,000 ఫీజు కంపెనీలను తీవ్రంగా ప్రభావితం చేసింది.

ఈ భారీ ఫీజు కారణంగా అనేక సంస్థలు.. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి వెనకడుగు వేసినట్లు కోర్టు రికార్డులు తెలిపాయి. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H-1B రిజిస్ట్రేషన్లు గతంతో పోలిస్తే దాదాపు 38.5% తగ్గినట్లు యూఎస్ ఇమ్మిగ్రేషన్ శాఖ తెలిపింది. ఇది విదేశీ నిపుణులపై ప్రభావం చూపింది.

నిర్ణయాన్ని సమర్థించిన ట్రంప్ ప్రభుత్వం
ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. అమెరికా ఉద్యోగాలను రక్షించడమే లక్ష్యమని తెలిపింది. విదేశీ ఉద్యోగులు తక్కువ జీతాలతో అమెరికన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని, ముఖ్యంగా సాంకేతిక రంగాల్లో ఇది పెద్ద సమస్యగా మారిందని వాదించింది. కానీ కోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. 

ఎంతోమందికి ఉపశమనం
ఇక భారతదేశంపై కూడా ఈ విధానం ప్రభావం చూపింది. H-1B వీసాలపై ఆధారపడే భారతీయ ఐటీ నిపుణులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కఠిన నిబంధనల వల్ల దరఖాస్తులు తగ్గి, అనేక మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా అధికారులతో చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇది మార్పు దశలో ఉన్న విధానం అని, కొన్ని ఇబ్బందులు సహజమని వ్యాఖ్యానించారు. కానీ తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు అటు కంపెనీలకు, ఇటు యూఎస్ వెళ్లాలనుకునే ఎంతోమందికి ఉపశమనం కలిగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement