పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లో నిన్న (శనివారం) అమెరికా - ఇరాన్ మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచం అంతా ఈ భేటీ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అయితే ఉద్విగ్న సమయాలలో యుద్ధానికి కారణమైన ట్రంప్ మాత్రం ఏ మాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరించాడట.. తనకు ఏమాత్రం సంబంధం లేనట్లుగా ఆ సమయంలో ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌కు వెళ్లారట.
ఇరాన్- అమెరికా మధ్య నిన్న జరిగిన శాంతి చర్చలు ఏలాంటి పురోగతి లేకుండానే ముగిసిన సంగతి తెలిసిందే. అమెరికా డిమాండ్లకు ఇరాన్ తలొగ్గకపోవడంతో చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. అయితే చర్చల ఫలితం ఏముంటుందా అని ప్రపంచ దేశాలు చాలా ఉత్కంఠగా ఎదురుచూశాయి. అయితే అంత కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఎంతో కూల్‌గా ఉన్నారట. అతనికి ఏమి పట్టనట్లు ఒక క్రీడా కార్యక్రమానికి వెళ్లారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
మాయామిలోని ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌కు ట్రంప్‌తో తన కుటుంబంతో పాటు విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రుబియో, భారత్‌లోని అమెరికా రాయభారి సెర్గియో గోర్, ఇతర అధికారులతో కలిసి గంటల సమయం గడిపారు. అధికారులు చర్చల వివరాలు తెలియజేయడానికి వచ్చినప్పటికీ ట్రంప్ పెద్దగా పట్టించుకోకుండా గేమ్ ఎంజాయ్ చేశారని అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆ సమయంలో విదేశాంగ శాఖ మంత్రి ట్రంప్‌కు ఫోన్ చూపిస్తూ ఏదో చెప్పినప్పటికీ ఆయన ముఖంలో ఏలాంటి భావాలు లేవని తెలిపారు.
అంతేకాకుండా మ్యాచ్ అనంతరం విజేతలను అభినందించారని వారితో కలిసి గడిపారని కథనాలు పేర్కొన్నాయి.. అయితే గతంలోనూ ఈ చర్చలు గురించి తాను పట్టించుకోనని ఇరాన్ సైనికంగా ఎప్పుడో ఓడిపోయిందని అన్నారు. కాగా అమెరికాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చర్చలు జరుగుతున్నప్పుడు అధ్యక్షుడు ఈ విధంగా వ్యవహరించడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


