పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ మధ‍్య ఏకంగా 21 గంటలు చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే ప్రయత్నాన్ని ఆపాలని హామీ ఇవ్వలేదని అమెరికా తెలిపింది. చర్చల విఫలం కారణంగా 14 రోజుల కాల్పుల విరమణ అనిశ్చితిలో పడింది. ఎందుకు ఎందుకు విఫలమయ్యాయి? ఒప్పందం కుదరకపోతే.. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుందని ట్రంప్ చెప్పినట్లే చేస్తారా?
డిమాండ్లు విఫలం కావడానికి ప్రధాన కారణం
ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదన‍్న హామీ కావాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యం. చర్చల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌తో ఉపాధ‍్యక్షుడు జేడీ వాన్స్ నిరంతరతరం సంప్రదింపులు జరిపారు. అమెరికా డిమాండ్లను అసంబద్ధం అంటూ ఇరాన్ తిరస్కరించింది. అణు పరిమితులు, ప్రాంతీయ అంశాలపై వాషింగ్టన్ వైఖరి చర్చల పురోగతిని అడ్డుకుందని ఇరాన్ మీడియా తెలిపింది.
ఇటీవల కొన్ని వారాల యుద్ధం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య నమ్మకం బాగా తగ్గిపోయింది. ఒకేసారి జరిగిన చర్చల‍్లోనే పరిష్కారం రావాలని ఆశించడం సరికాదని ఇరాన్ అభిప్రాయపడ్డారు. పలు అంశాలపై ఇరాన్ ఏ మాత్రం తగ్గలేదు. ఇరాన్ “రెడ్ లైన్లు”గా ఆంక్షల ఉపశమనం, యుద్ధ పరిహారం, లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై పరిమితులను ప్రస్తావించింది. హార్మూజ్ జలసంధి అంశం ఇరు దేశాలపై ఒత్తిడి పెంచింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు, హిజ్బుల్లాపై ఆపరేషన్లు చర్చలను మరింత క్లిష్టం చేశాయి.
యుద్ధం ప్రారంభం నుంచి 2,000 మందికి పైగా మరణించారని లెబనాన్ అధికారులు తెలిపారు. హిజ్బుల్లాతో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ తిరస్కరించింది. తాము నిజాయితీతో చర్చించామని అమెరికా, ఇరాన్ రెండు దేశాలూ చెప్పుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ ఏమవుతుందన్న విషయంపై, తదుపరి చర్యలపై చర్చలు విఫలమయ్యాక వాన్స్ స్పష్టత ఇవ్వలేదు. రెండు పక్షాలు కాల్పుల విరమణ పాటించాలని పాకిస్థాన్ కోరింది.
అమెరికా చెప్పినట్లు చేస్తే భారీ విధ్వంసం
ఒప్పందం కుదరకపోవడంతో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దౌత్య ప్రయత్నాలు తిరిగి మొదలవుతాయా? కాల్పుల విరమణ ముగుస్తుందా? అన్న ప్రశ్నలు మొదట వస్తున్నాయి. చర్చలు కుదరకపోవడంతో పశ్చిమాసియాలో అస్థిరత పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతమైతే కాల్పుల విరమణ కొనసాగుతోంది.
తదుపరి చర్యలపై స్పష్టత లేదు. చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్‌పై మళ్లీ దాడులు జరిగే ప్రమాదం పెరిగింది. హార్మూజ్ జలసంధి వివాదం పరిష్కారం కాలేదు. చర్చల ద్వారా తిరిగి తెరవడంపై అనిశ్చితి నెలకొంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ నౌకల మోహరింపుతో ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా ఇప్పటికీ సిద్ధంగానే ఉంది. ఒప్పందం కుదరకపోతే భీకర దాడులు చేస్తామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించడంతో చెప్పినట్లే చేస్తారా? అన్న ఆందోళన నెలకొంది.
అమెరికా తన సైన్యాన్ని ఇరాన్ సరిహద్దులకు సమీపంలోకి తరలించింది. ఒప్పందం కుదిరే వరకు ఈ బలగాలు అక్కడే ఉంటాయని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగంలోకి సైన్యం ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇటు ఇరాన్ కూడా హెచ్చరించింది. గతంలో అఫ్గానిస్థాన్, ఇరాక్‌లో అమెరికా చేసిన ఆపరేషన్‌లు గుర్తుకు వస్తున్నాయి.
అయితే, అమెరికా భూతలదాడులు చేస్తే కొన్నేళ్లపాటు యుద్ధం జరిగే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, మొదట ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, బ‍్రిడ్జిలను కుప్పకూల్చుతామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుందని, ఈ నిర్ణయాన్ని ముందే తీసుకున్నామని ట్రంప్ చెప్పారు. అమెరికా చెప్పినట్లు చేస్తే భారీ విధ్వంసమే జరుగుతుంది.


