వాషింగ్టన్: భారతీయ సనాతన ధర్మం గొప్పదనాన్ని, హిందూ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వామి వివేకానందుదునికి అమెరికాలో అత్యంత అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన సియాటెల్ నడిబొడ్డున స్వామి వివేకానందుని నిలువెత్తు కాంస్య విగ్రహం ఘనంగా కొలువుదీరింది.
అమెరికా చరిత్రలో ఒక నగరపాలక సంస్థ (సిటీ గవర్నమెంట్) ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన తొలి స్వామి వివేకానంద విగ్రహం ఇదే కావడం విశేషం. ఈ చారిత్రక ఘట్టం అమెరికాలో స్థిరపడిన ప్రతి భారతీయుడి మనసు ఉప్పొంగేలా చేస్తోంది. నిత్యం లక్షలాది మంది సందర్శకులతో రద్దీగా ఉండే సియాటెల్ డౌన్ టౌన్ లోని ప్రముఖ ‘వెస్ట్ లేక్ స్క్వేర్’ వద్ద ఈ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రపంచ ప్రఖ్యాత అమెజాన్ స్పియర్స్, సియాటెల్ కన్వెన్షన్ సెంటర్, సియాటెల్ సెంటర్ మోనోరైల్ లాంటి కీలకమైన ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
శనివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సియాటెల్ మేయర్ కేటీ విల్సన్, భారత కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తా ఈ విగ్రహాన్ని సంయుక్తంగా ఆవిష్కరించారు. ప్రముఖ భారతీయ శిల్పి నరేష్ కుమార్ కుమావత్ అత్యంత ఆకర్షణీయంగా, జీవకళ ఉట్టిపడేలా ఈ కాంస్య విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఐసీసీఆర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం, అమెరికాతో భారత సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు. 1893లో జరిగిన చికాగో ప్రపంచ మత సమ్మేళనంలో వివేకానందుడు చేసిన చారిత్రాత్మక ప్రసంగం నాటి నుంచి.. నేటి అత్యాధునిక గ్లోబల్ టెక్ హబ్ సియాటెల్ వరకు అమెరికాతో మనకున్న అనుబంధానికి ఈ విగ్రహం ఒక సజీవ ప్రతీకగా నిలుస్తుందని కాన్సులేట్ జనరల్ అభివర్ణించారు. స్థానిక పౌర ప్రముఖులు, ఎన్నారైలు, భారతీయ అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు.


