
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టా నగరంలో ఆత్మాహుతి దాడి జరిగింది. పాక్ పారామిలటరీ సిబ్బంది లక్ష్యంగా జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో పలువురు మరణించారు. 30మందికి పైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో సీసీ టీవీ ఫుటేజీల్లో రోడ్డుపై ఉన్న వాహనాలు ఎగిరిపడ్డాయి. ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
భారీ పేలుడు ధాటికి ఘటన జరిగిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల మేర భూమి కంపించింది. పేలుడు తీవ్రతతో భవనాలు సైతం దెబ్బతిన్నట్లు పాక్ స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
పాక్ మీడియా కథనం ప్రకారం..పాకిస్థాన్‌లో అతిపెద్ద నగరం క్వెట్టా జర్ఘున్ రోడ్‌లో పాకిస్థాన్ పారామిలటరీ ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో పారామిలటరీ జవాన్లే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగినట్లు సమాచారం. ఆత్మాహుతి దాడి అనంతరం కాల్పులు సైతం వినిపించాయి.
ఈ ఘటనపై బలూచిస్తాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ ముహమ్మద్ కాకర్ స్పందించారు. ఆత్మాహుతి దాడిలో పదిమందికిపైగా మరణించారని ధృవీకరించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాక్ మీడియా సంస్థ డాన్ నివేదించింది.