
ప్రాథమిక హక్కుల కోసం పోరుబాట
ముజఫరాబాద్‌లో జనంపై కాల్పులు
ఇద్దరి మృతి.. 22 మందికి గాయాలు
ముజఫరాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు. నిరంకుశ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. తమకు ప్రాథమిక హక్కులు కల్పించాలని, అణచివేత చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తూ జనం ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఓకే రాజధాని ముజఫరాబాద్‌లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య ఘ ర్షణ జరిగింది.
హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న సాధారణ ప్రజలపై పాక్ సైన్యంతోపాటు ఐఎస్‌ఎస్ అండదండలున్న ముస్లిం కాన్ఫరెన్స్ సాయుధ ముష్కరులు కిరాతకంగా కాల్పులు జరిపారు. హక్కుల కోసం ఉద్యమిస్తున్నవారిని పొట్టనపెట్టుకున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, 22 మందికిపైగా గాయపడ్డారు. ముజఫరాబాద్ వీధులు రణరంగాన్ని తలపించాయి. హింసాకాండ దృశ్యాలు పాకిస్తాన్ వార్తా చానళ్లలో ప్రసారమయ్యాయి.
తెరపైకి 38 డిమాండ్లు
ప్రాథమిక హక్కుల సాధన కోసం పీఓకేలో అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమిస్తోంది. ఆదివారం నుంచి ఆందోళనలు ఉధృతంగా మారాయి. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. బంద్ పాటించారు. సోమవారం మార్కెట్లు, దుకాణాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా సేవలు నిలిచిపోయాయి. ఆందోళనకారులు మొత్తం 38 డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం వాటిని నెరవేర్చేదాకా తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. పాకిస్తాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో 12 సీట్లను పాక్ ప్రభుత్వం రిజర్వ్ చేసింది.
ఈ సీట్లను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ అసెంబ్లీలో కేవలం స్థానికులకే ప్రాతినిధ్యం ఉండాలని అంటున్నారు. పీఓకేలోని మాంగ్లా డ్యామ్, నీలం–జీలం ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 60 శాతానికి పాకిస్తాన్‌కే సరఫరా అవుతోంది. స్థానికులకు దక్కుతున్న ప్రయోజనం స్వల్పమే. ఇదే అంశం వారిలో అసంతృప్తి కలిగిస్తోంది. పీఓకేలోని వనరులు తమకే దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ధరలు విపరీతంగా పెరగడం జనంలో అసహనం కలిగిస్తోంది. ఇవన్నీ ప్రజా ఉద్యమాన్ని ప్రేరేపించాయి.
గత 70 ఏళ్లుగా పాక్ ప్రభుత్వం తమను క్రూరంగా అణచివేస్తోందని, కనీస హక్కులు కూడా కల్పించడం లేదని అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ఆరోపించారు. ప్రజల ఓపిక నశించిందని, అందుకే పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. తమ డిమాండ్లను ఇప్పటికైనా నెరవేర్చకపోతే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉందని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు తేల్చిచెప్పారు.
అణచివేత చర్యలు ప్రారంభం
పీఓకేలో ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ సర్కార్ చర్యలు చేపట్టింది. భారీ సంఖ్యలో సాయుధ బలగాలను రంగంలోకి దించింది. సమీపంలోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి వేలాది మంది సైనికులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చేరుకున్నారు. పలు పట్ణణాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. వీధుల్లోకి రావొద్దని ప్రజలను హెచ్చరించారు. రాజధాని ఇస్లామాబాద్ నుంచి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు సమాచారం. పీఓకేలో ఆందోళన కార్యక్రమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పీఓకేలో ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పాక్ వైమానిక దళం గతవారం ఖైబర్ పఖ్తూంక్వా ప్రావిన్స్‌లోని ఓ మారుమూల గ్రామంపై భారీస్థాయిలో విరుచుకుపడింది. చైనా ఇచ్చిన జే–17 ఫైటర్ జెట్లతో ప్రజలపై నిప్పుల వర్షం కురిపించింది. చైనాలో తయారైన ఎల్‌ఎస్–6 లేజర్ గైడెడ్ బాంబులు ప్రయోగించింది. ఈ దాడిలో 30 మంది సాధారణ ప్రజలు మరణించారు. అది జరిగిన వారం రోజులకే పీఓకేలో ఆందోళనలు ప్రారంభం కావడం గమనార్హం.