చైనా ముప్పు మరింత పెరిగింది | Taiwan needs US weapons to defend against China threat grows | Sakshi
Sakshi News home page

చైనా ముప్పు మరింత పెరిగింది

Jun 21 2026 12:30 AM | Updated on Jun 21 2026 12:30 AM

Taiwan needs US weapons to defend against China threat grows

ఆత్మరక్షణ కోసం ఆయుధాలు కావాలి

అమెరికా తక్షణమే ఆయుధాలను అందించాలి

మా పట్ల అగ్రరాజ్యం విధానంలో మార్పులేదు

తైవాన్‌ ఉన్నతాధికారి వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: చైనా నుంచి బెడద తమకు మరింతగా పెరిగిందని తైవాన్‌ అంటోంది. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం తక్షణమే అమెరికా ఆయుధాలను అందించాలని కోరుతోంది. అదేసమయంలో, తమ విషయంలో అమెరికా విధానంలో మార్పు వచ్చినట్లుగా ఎటువంటి చాయలు కనిపించడం లేదని తెలిపింది. అమెరికాలోని తైపీ ఎకనామిక్‌ అండ్‌ కల్చరల్‌ రిప్రజెంటేటివ్‌ కార్యాలయం చీఫ్‌ అలెగ్జాండర్‌ యుయి టాహ్‌ రే ఇటీవల వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడారు. 

తైవాన్‌ విషయంలో గత ప్రభుత్వాల విధానాలకు భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. అమెరికా ప్రధాన భూభాగానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్‌ను రక్షించడం తమవల్ల కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో తైపీలోని నేతలు షాకయ్యారు. తైవాన్‌ రక్షణ బాధ్యత ఆ దేశ ప్రజలే చూసుకోవాలని కూడా అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎకనామిక్‌ అండ్‌ కల్చరల్‌ రిప్రజెంటేటివ్‌ కార్యాలయం చీఫ్‌ అలెగ్జాండర్‌ యుయి టాహ్‌ రే తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అమెరికా కోసం ఎదురు చూడలేం 
‘ఆత్మరక్షణ కోసం మాకు ఆయుధాలు కావాలి. రక్షణ బడ్జెట్‌ను పెంచుకుంటున్నాం. సంక్షోభాన్ని తట్టుకుని, మమ్మల్ని మేం రక్షించుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం’అని అలెగ్జాండర్‌ చెప్పారు. ‘మా భద్రతకు మాదే బాధ్యత. అమెరికా సైన్యం వచ్చి మమ్మల్ని కాపాడుతుందని ఎదురు చూస్తూ ఉండలేం. ఆ దేశ సైన్యంపై ఆధారపడలేం. 

అందుకే మమ్మల్ని మేం మరింత బలోపేతం చేసుకోవ డానికి అమెరికా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’అని ఆయన అన్నారు. చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు స్థాయికి తగినట్లుగా ఆయుధాల విక్రయం ఉండాలన్న ఆయన.. ప్రస్తుతం చైనా నుంచి ముప్పు వాస్తవానికి చాలా ఎక్కువగానే ఉందని వ్యాఖ్యానించారు. ‘మేం దురాక్రమణదారులం కాదు. చైనా మాత్రమే నిరంతరం యుద్ధ విమానాలను, నౌకలను మా వైపునకు పంపుతూ కయ్యానికి కాలు దువ్వుతోంది. తైవాన్‌లో మాకున్న స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నది కూడా చైనాయే’అని ఆయన ఆరోపించారు.

రుబియో చెప్పిందదే..
తైవాన్‌ విషయంలో అమెరికా విధానంలో మార్పు వచ్చినట్లు తమకు కనిపించడం లేదని అలెగ్జాండర్‌ చెప్పారు. ఈ విషయంలో ట్రంప్‌ ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కొన్ని ప్రకటనలను తమ ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. తమకు ఆయుధాల విక్రయం విషయంలో ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్క్‌ రుబియో కాంగ్రెస్‌ ఎదుట ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆయన ప్రస్తావించారు. తైవాన్‌కు ఆయుధాల విక్రయం అంశంపై చైనాతో సంప్రదింపులు, చర్చలు జరపలేదని రుబియో చెప్పారన్నారు. 

ఆయు ధాల ప్యాకేజీని నిలిపివేయలేదు, ఆయుధాల నిల్వలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్యాకేజీపై సమీక్ష మాత్రమే చేపట్టామని రుబియో తెలిపారని అలెగ్జాండర్‌ గుర్తు చేశారు. చైనా దాడి చేసిన పక్షంలో తైవాన్‌కు కాపాడేందుకు సైన్యాన్ని పంపేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు గత అధ్యక్షుడు జో బైడెన్‌ పలుమార్లు ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పసిఫిక్‌ సముద్రంలోని తైవాన్‌ తదితర ద్వీపాలపై చైనా పెత్తనాన్ని నిలువరించేందుకు రక్షణ వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేయాలని రక్షణ శాఖ నివేదిక సైతం పేర్కొంది.

మాట మార్చిన ట్రంప్‌
చైనాను నిలువరించేందుకు తైవాన్‌కు 1,400 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు ఉద్దేశించిన భారీ ప్యాకేజీపై ఈ ఏడాది ఆరంభంలో అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలిపింది. అప్పట్లో ట్రంప్‌ దీనిని ‘చైనాతో అత్యుత్తమమైన బేరసారాల చిప్‌’గా అభివర్ణించారు. కాగా, మేలో చైనా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో కుదిరిన ఒప్పందం మేరకు తైవాన్‌కు వాగ్దానం చేసిన 1,400 కోట్ల డాలర్ల ఆయుధ ప్యాకేజీని పక్కన బెడుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీనిపై తైవాన్‌తోపాటు అమెరికా ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

తైవాన్‌పై తీవ్ర ఒత్తిడులు
తైవాన్‌ తమ భూభాగమేనని, ఎప్పటికైనా తాము కలిపేసుకుంటామని చైనా గట్టిగా చెబుతోంది. చైనా ఒత్తిళ్లతో అమెరికా సహా చాలా దేశాలు తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. తైవాన్‌ సాధారణ దౌత్య సంబంధాలను కొనసాగించకుండా చైనా అడ్డుతగులుతోంది. అదే సమయంలో, అమెరికా ఆయుధాలను అందజేస్తూ గట్టి మద్దతుదారుగా ఉంటోంది. అలెగ్జాండర్‌ అధికారికంగా తైవాన్‌ రాయబారి కాదు, ఉన్నత స్థాయి ప్రతినిధి మాత్రమే . చైనా దురాక్రమణను నిరోధించేందుకు తైవాన్‌కు అవసరమైన ఆయుధాలను అందజేయాలన్నది అమెరికా విధానంగా ఉంటూ వస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో తైవాన్‌ చుట్టూ చైనా పలుమార్లు పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలను నిర్వహించింది. దాదాపు నిత్యం తైవాన్‌ సరిహద్దులకు సమీపంలోకి యుద్ధనౌకలను, సైనిక విమానాలను పంపుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement