ట్రంప్‌కు భారీ ఊరట.. టీపీఎస్‌ రద్దుకు గ్రీన్‌సిగ్నల్‌ | Supreme Court Hands Trump Major Victory in TPS Case | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు భారీ ఊరట.. టీపీఎస్‌ రద్దుకు గ్రీన్‌సిగ్నల్‌

Jun 26 2026 7:09 AM | Updated on Jun 26 2026 7:11 AM

Supreme Court Hands Trump Major Victory in TPS Case

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ విజయం దక్కింది. వలస విధానాల విషయంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయాన్ని సమర్థించేలా అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో లక్షలాది మందిని వెనక్కి పంపించేందుకు(Deport) కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న ప్రయత్నాలకు మార్గం సుగమమైంది.   

ట్రంప్‌ సర్కార్‌కు అనుకూలంగా అమెరికా సుప్రీం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. హైతీ, సిరియా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకు ఇప్పటివరకు లభిస్తున్న టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ (TPS) రక్షణను రద్దు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ, ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది ఒక్కసారిగా డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. 

ఈ తీర్పును ట్రంప్ ప్రభుత్వం "చట్టానికి దక్కిన విజయం"గా అభివర్ణిస్తుండగా.. మానవ హక్కుల సంఘాలు మాత్రం "వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయం" అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఏళ్లుగా.. లక్ష్యంగా.. 
డొనాల్డ్ ట్రంప్ తన తొలి అధ్యక్ష పదవీకాలం (2017-2021) నుంచే వలస విధానాలను కఠినతరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ పేరుతో అనేక మంది అమెరికాలో శాశ్వతంగా ఉండిపోతున్నారని అప్పటినుంచే ఆయన విమర్శిస్తున్నారు. తన మొదటి టర్మ్‌లోనే హైతీ, ఎల్‌సాల్వడోర్, నికరాగువా, సూడాన్‌ తదితర దేశాలకు ఇచ్చిన టీపీఎస్‌ను రద్దు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఫెడరల్ కోర్టులు పలుమార్లు ట్రంప్ నిర్ణయాలను నిలిపివేశాయి. 2021లో ఆయన పదవి వీడటంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

తిరిగి.. 2025 జనవరిలో రెండోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అదే అజెండాను వేగవంతం చేసింది. ఇప్పటికే వెనెజువెలా వలసదారుల టీపీఎస్‌పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు హైతీ, సిరియాపై కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వచ్చిన తాజా సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్‌కు అత్యంత కీలక విజయంగా భావిస్తున్నారు.

TPS అంటే ఏంటంటే.. 
1990లో అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, తీవ్ర రాజకీయ అస్థిరత లేదంటే మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాల పౌరులకు అమెరికా తాత్కాలిక రక్షణ(Temporary Protected Status.. TPS) కల్పిస్తుంది. ఈ హోదా పొందిన వ్యక్తులను వారి స్వదేశాలకు బలవంతంగా పంపించరు. అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది గ్రీన్‌కార్డు లేదంటే పౌరసత్వానికి మార్గం కాదు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ప్రభుత్వం ఈ హోదాను రద్దు చేయవచ్చు.

అయితే 2010లో సంభవించిన భారీ భూకంపం తర్వాత హైతీ పౌరులకు టీపీఎస్‌ ఇచ్చారు. 2012లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడి ప్రజలకు కూడా ఈ రక్షణ కల్పించారు. అనంతరం ఆయా దేశాల్లో పరిస్థితులు పూర్తిగా మెరుగుపడకపోవడంతో వరుస ప్రభుత్వాలు ఈ గడువును పొడిగిస్తూ వచ్చాయి.

అసలు వివాదం ఎలా మొదలైంది?
2025లో తిరిగి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. వలసవాదుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నది చూస్తున్నదే. ఈ క్రమంలో ఈ హక్కును "తాత్కాలిక రక్షణ"గా కాకుండా "శాశ్వత వలస మార్గం"గా మార్చేశారని ఆరోపిస్తూ వస్తున్నారాయన. ఈ క్రమంలోనే హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ హైతీ, సిరియా దేశాలకు ఇచ్చిన TPSను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై వలసదారుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం.. హైతీలో గ్యాంగ్ హింస, కిడ్నాప్‌లు, రాజకీయ అరాచకాలు కొనసాగుతున్నాయని, సిరియాలో అంతర్యుద్ధం ప్రభావం పూర్తిగా తొలగిపోలేదని వాదించాయి. ఈ పరిస్థితుల్లో వారిని తిరిగి పంపడం ప్రాణాంతకమని పేర్కొన్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టులు కూడా ఇదే అభిప్రాయంతో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సుప్రీంకోర్టు సంచలన తీర్పు 
తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా.. 6-3 మెజార్టీతో ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జస్టిస్ శామ్యూల్ అలిటో తీర్పు ఇస్తూ.. టీపీఎస్‌ ఇవ్వాలా? రద్దు చేయాలా? అనేది పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయాలను కోర్టులు సమీక్షించే అధికారం చట్టం ఇవ్వలేదని పేర్కొన్నారు. అందువల్ల దిగువ కోర్టులు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేయడం సరైనది కాదని తేల్చిచెప్పారు.

భిన్నాభిప్రాయంలో.. 
ఈ తీర్పుతో లిబరల్ న్యాయమూర్తులు ఎలీనా కేగన్, సోనియా సోటోమేయర్, కేతంజీ బ్రౌన్ జాక్సన్ తీవ్ర విభేదించారు. జస్టిస్ కేగన్ తన భిన్నాభిప్రాయంలో ట్రంప్ గతంలో హైతీ ప్రజలపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. హైతీ వలసదారులపై జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రక్రియను పాటించిందా లేదా అన్నది కోర్టులు పరిశీలించే హక్కు ఉందని అభిప్రాయపడ్డారు.

ఎంతమందిపై ప్రభావమంటే.. 
ఈ తీర్పు తక్షణ ప్రభావం.. సుమారు 3.5 లక్షల మంది హైతీ పౌరులు, 6,100 మంది సిరియా పౌరులపై పడనుంది. వీరంతా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ, కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. అయితే దీని ప్రభావం ఇంతటితో ఆగే అవకాశం లేదు. ప్రస్తుతం 17 దేశాలకు చెందిన సుమారు 13 లక్షల మంది టీపీఎస్‌ కింద అమెరికాలో నివసిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన తీర్పు ఆధారంగా.. భవిష్యత్తులో ఇతర దేశాల TPSలను కూడా రద్దు చేసే అవకాశాలు పెరిగాయని వలస నిపుణులు చెబుతున్నారు.

మానవ హక్కుల సంఘాల తీవ్ర ఆందోళన
ఈ తీర్పుపై పలు మానవ హక్కుల సంస్థలు, వలసదారుల హక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. హైతీ, సిరియాలో పరిస్థితులు బాగోలేవని అంటున్నాయి. హైతీ వలసదారుల తరఫు న్యాయవాదులు.. "ఈ తీర్పు వేలాది మంది అమాయకుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది" అని హెచ్చరించారు. అమెరికాలోని ప్రముఖ పౌరహక్కుల సంస్థ NAACP కూడా ఈ తీర్పును తీవ్రంగా తప్పుబట్టడం గమనార్హం. అమెరికా అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న హైతీ కుటుంబాలను ఒక్కసారిగా అనిశ్చితిలోకి నెట్టివేయడం మానవతా దృక్పథానికి విరుద్ధమని పేర్కొంది.  ఒహాయోలోని హైతీ సపోర్ట్ సెంటర్ ప్రతినిధులు కూడా "ఇప్పటికే వేలాది కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయి. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలా? ఉద్యోగాలకు వెళ్లాలా? లేక ఎప్పుడు డిపోర్ట్ చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రంప్ ప్రభుత్వం స్పందన ఇదే..
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఈ తీర్పును స్వాగతించింది. TPS అసలు ఉద్దేశాన్ని దుర్వినియోగం చేసి శాశ్వత వలస మార్గంగా మార్చేశారని పేర్కొంది. వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ ఈ తీర్పును "పదేళ్లుగా ఎదురుచూస్తున్న విజయం" గా అభివర్ణించారు. ఇప్పుడు హైతీ వలసదారులను స్వదేశాలకు పంపే ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్పారు.

'బిగ్ రిలీఫ్‌' ఎందుకంటే..
రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వలస విధానాలకు కోర్టుల్లో వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఇటీవల వెనిజులా టీపీఎస్‌ కేసుతో పాటు, ఆశ్రయం కోరే వలసదారులపై పరిమితుల విషయంలోనూ సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. ఇప్పుడు హైతీ, సిరియా టీపీఎస్‌ కేసులో కూడా ట్రంప్‌కు మద్దతుగా తీర్పు రావడంతో ఆయన వలస విధానాలకు అత్యున్నత న్యాయస్థానం నుంచి మరోసారి బలమైన మద్దతు లభించినట్టైంది. అందుకే ఈ తీర్పును అమెరికా రాజకీయ వర్గాలు ట్రంప్‌కు బిగ్ రిలీఫ్ గా అభివర్ణిస్తున్నాయి. ఇక ఈ నిర్ణయం అమెరికా వలస విధానాల భవిష్యత్తును గణనీయంగా ప్రభావితం చేసే అవకాశముందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement