breaking news
tps
-
సర్కారు వారి పబ్లిక్ స్కూల్
పబ్లిక్ స్కూల్ అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. అక్కడ చదువుతోపాటు ఆటపాటలు, సరికొత్త ఆలోచనలతో కూడిన బోధన, అభ్యసన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇలాంటి పాఠశాలను ఏకంగా ప్రభుత్వమే నిర్వహిస్తే ఇంకేముంది.. పేద, మధ్యతరగతి పిల్లలంతా పరుగెత్తి అందులో చేరిపోతారు. అలాంటిదే ఇక్కడా జరిగింది.రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మార్గనిర్దేశంలో ఏర్పాటైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు ఈ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందింది.ఒకవైపు మౌలిక వసతుల కల్పన కొనసాగుతుండగానే... వందల మంది విద్యార్థులతో ఇప్పుడు ఈ పాఠశాల కళకళలాడుతోంది. పూర్వ ప్రాథమికం నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రహరీలో బోధన సాగుతోంది. సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ విధానంలో కాకుండా డే స్కాలర్ పద్ధతిలో మరిన్ని స్కూళ్లు ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)పై కొన్ని సూచనలు చేశారు. దీంతో రాష్ట్రంలో నాలుగు చోట్ల టీపీఎస్‌లు ఏర్పాటయ్యాయి. ఒకే ప్రాంగణంలోకి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జతచేయడంతోపాటు అక్కడే పూర్వప్రాథమిక పాఠశాలతోపాటు జూనియర్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇలా రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల, మంచాల, నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు, పోల్కంపల్లిలో వీటిని ఏర్పాటు చేశారు. ఆరుట్ల టీపీఎస్‌లో ఇప్పటికే వివిధ మౌలిక వసతుల కల్పన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.నాలుగు చోట్ల ఇలా... ⇒ ఆరుట్ల టీపీఎస్: ప్రాథమిక, ఉన్నత పాఠశాలతోపాటు తెలంగాణ మోడల్ స్కూల్‌ను ఒకే చోటకు తీసుకొచ్చారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్‌వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ⇒ మంచాల టీపీఎస్: ప్రాథమిక పాఠశాలతో పాటు జెడ్పీహెచ్ఎస్(బాలికలు), జెడ్పీహెచ్ఎస్(బాలురు)లను ఒకే చోటకు తీసుకొచ్చారు. ఇక్కడ నర్సరీ నుంచి పదోతరగతి వరకు ఉంది. ⇒ వంగూరు టీపీఎస్: ఎంపీపీఎస్ వంగూరు, జెడ్పీహెచ్ఎస్(బాలికలు), జెడ్పీహెచ్ఎస్(బాలురు), కేజీబీవీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఒకే చోటకు తీసుకొచ్చారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతాయి. ⇒ పోల్కంపల్లి టీపీఎస్: ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఒకే చోటకు చేర్చాలని ఆదేశించింది. ఇక్కడ నర్సరీ నుంచి పదోతరగతి వరకు బోధన జరుగుతోంది. ఎస్డీఎంసీ కీలకం... తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో పాఠశాల అభివృద్ధి నిర్వహణ కమిటీ (ఎస్డీఎంసీ)లే కీలక పాత్ర పోషిస్తాయి. పాఠశాల పరిధిలో ఎలాంటి పనులైనా టెండర్లు లేకుండా కేవలం ఎస్డీఎంసీల ఆమోదం, పర్యవేక్షణలోనే నిర్వహించాలి. ప్రస్తుతం ఆరుట్ల టీపీఎస్‌లో ఇదే తరహాలో అబివృద్ధి పనులు సాగుతున్నాయి. ఎస్‌డీఎంసీలో 23 మంది సభ్యులున్నారు. ⇒ ఇప్పటికే బాస్కెట్‌బాల్ కోర్టు, బాక్స్ క్రికెట్ , కోకో గ్రౌండ్ పూర్తయ్యాయి. ⇒ గ్రంథాలయం, డైనింగ్ హాళ్లు, సీసీరోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ⇒ క్లాస్‌రూమ్‌లు కూడా రంగురంగుల్లో అత్యాధునిక ఫర్నిచర్‌తో ఏర్పాటు చేశారు. ⇒ వివిధ రకాల ఆటవస్తువులు అందుబాటులో ఉండడంతో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా బడికి వస్తున్నారు. అప్పుడు 700 మంది.. ఇప్పుడు 1,629 మంది విద్యార్థులు ప్రస్తుతం ఆరుట్ల టీపీఎస్ పరిధిలో పూర్వ ప్రాథమిక పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేశారు. ఇందులో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు రెండేసి సెక్షన్లున్నాయి. మొత్తం ఆరు సెక్షన్ల పరిధిలో 126 మంది చిన్నారులున్నారు. ⇒ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్ ముందు నుంచే కొనసాగుతున్నాయి. ఈ మూడింటిలో 700 మంది ఉండగా... టీపీఎస్ తర్వాత విద్యార్థుల సంఖ్య 1,629కు చేరింది. ⇒ ప్రాథమిక పాఠశాలలో ఇదివరకు 90 మంది విద్యార్థులుండగా... ఇప్పుడా సంఖ్య 514కు చేరింది. ⇒ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 250 నుంచి 360కి పెరిగారు. మోడల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 350 నుంచి 629కి చేరింది. ⇒ ప్రీప్రైమరీ టీచర్లను కమిటీ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. ఒక్కో టీచర్‌కు రూ.15 వేలు, ఆయాకు రూ.10 వేలు వేతనాలిస్తున్నారు. బస్సుల నిర్వహణకు రాయితీ బస్సుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఒక్కో బస్సుపై గరిష్టంగా రూ.12.5 లక్షలు రాయితీ ఉంది. ఆరుట్లలో మూడు బస్సులు నడుపుతూ 200 మంది విద్యార్థులను సమీప గ్రామాల నుంచి రోజూ స్కూల్‌కు చేర్చుతున్నారు. బస్సు నిర్వహణ కోసం వాటిల్లో వచ్చే విద్యార్థుల నుంచి నామమాత్రంగా ఫీజులు తీసుకుంటున్నారు. సీఎస్ఆర్ కింద రూ.3 కోట్లు వచ్చాయిపాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే నిధులకు అదనంగా సీఎస్ఆర్ నిధులు కూడా దాదాపు రూ. 3 కోట్ల వరకు రాగా, అభివృద్ధి పనులకు ఖర్చు చేశాం. పనులను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. –ఎస్.గిరిధర్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు టీచర్ల పిల్లలూ ఇక్కడే... మా పాఠశాలలో దాదాపు 20 మంది పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ టీచర్లుగా పనిచేస్తున్నారు. ప్రతి శనివారం ఎస్డీఎంసీ సమావేశం జరుగుతుంది. కమిటీ సభ్యులు తప్పకుండా హాజరవుతారు. ఆ సమావేశంలో చర్చలు జరిపి అవసరాలకు అనుగుణంగా తీర్మానం చేసి కార్యాచరణ మొదలు పెడతాం. – కంబాలపల్లి భాస్కర్, ఎస్డీఎంసీ సభ్యుడు -
గోడకు నిధులిస్తే.. డ్రీమర్లకు గడువిస్తా
వాషింగ్టన్: అమెరికాలో కొనసాగుతున్న షట్డౌన్కు ముగింపు పలికేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. డెమొక్రాట్లు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలిపితే, దాదాపు 7 లక్షల మంది డ్రీమర్లకు(బాల్యంలోనే అమెరికాకు అక్రమంగా వచ్చినవారు) మూడేళ్ల పాటు తాత్కాలిక రక్షణ హోదా కల్పిస్తామని ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్ నుంచి శనివారం(స్థానిక కాలమానం) ప్రజలు, రాజకీయ నేతలనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. ‘వాషింగ్టన్‌లోని రెండు పక్షాలు(రిపబ్లికన్లు, డెమొక్రాట్లు) ఓ అంగీకారానికి రావాల్సిన అవసరం ఉంది. దేశంలోని 7,00,000 మంది డ్రీమర్లకు మరో మూడేళ్ల పాటు తాత్కాలిక రక్షణ హోదా(టీపీఎస్) కల్పిస్తాం. స్వదేశాల్లో హింస, అంతర్యుద్ధం కారణంగా అమెరికాలో ఉంటున్న 3 లక్షల మంది విదేశీయులకు టీపీఎస్‌ను మూడేళ్ల పాటు పొడిగిస్తాం. ఇందుకు ప్రతిగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది’ అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ కోసం 5.7 బిలియన్ డాలర్లు(రూ.40,615 కోట్లు) ఇవ్వాలని ట్రంప్ కోరుతున్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడి ప్రతిపాదన ఆచరణసాధ్యం కాదని డెమొక్రటిక్ నేత, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని షట్‌డౌన్ చేయడాన్ని ట్రంప్ గర్వంగా భావిస్తున్నారనీ, దీనిని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
నీ అంతు చూస్తాం
నగరపాలక సంస్థ అధికారులపై టీడీపీ నేతల దౌర్జన్యం రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. ఎన్నడూ లేని విధంగా దాడులు చేస్తూ, నోరు పారేసుకుంటున్నారు. ఇలాగైతే తాము ఇక్కడ పని చేయలేమంటూ అధికారులు, సిబ్బంది చర్చించుకోవడం దుమారం రేపుతోంది. అనంతపురం న్యూసిటీ: రాంనగర్‌లోని వెంకటేశ్వర దేవాలయం సమీపంలో టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకోకుండా ఓ యజమాని నిర్మాణాలు చేపట్టాడు. టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ (టీపీఎస్) వినయ్‌కుమార్ చాలాసార్లు బిల్డర్ (యజమాని)కి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈ నెల 29న నిర్మాణ పనులు మరింత వేగవంతం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శుక్రవారం టీపీఎస్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో వెళ్లి అనధికార నిర్మాణం చేపడుతున్న గోడను తొలగించారు. స్థల యజమాని కుమారుడు, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కుమారుడు మిత్రులు. విషయం ఎమ్మెల్యే వర్గీయుల దృష్టికి వెళ్లింది. ఫోన్లో నటేష్‌చౌదరి వార్నింగ్ చివరకు కార్పొరేటర్ నటేష్‌చౌదరి రంగంలోకి దిగి టీపీఎస్‌ను ఫోన్లో దుర్భాషలాడాడు. తనకు తెలియకుండా, తన అనుమతిలేకుండా తన డివిజన్‌లోకి అడుగుపెట్టి నిర్మాణాన్ని తొలగిస్తావా అంటూ ఆగ్రహించాడు. తనపై ఇదివరకే మర్డర్ కేసు ఉందని, కేసులు కొత్తేమీ కాదని.. నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగక ఎక్కడున్నావంటూ గద్దించడంతో ఆఫీసులో ఉన్నానని టీపీఎస్ తెలిపాడు. కార్పొరేటర్ మందీమార్బలంతో వస్తున్నాడని పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉందని భావించిన అధికారులు టీపీఎస్‌ను అక్కడి నుంచి పంపించేశారు. అనుకున్నట్టుగానే నటేష్‌చౌదరి కార్యాలయానికి చేరుకుని టీపీఎస్ ఎక్కడున్నాడంటూ వీరంగం వేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టార్గెట్ టీపీఎస్ ఎమ్మెల్యే వర్గీయులు టీపీఎస్ వినయ్‌కుమార్‌ను తరచూ టార్గెట్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం ఆరో రోడ్డులో తెలుగుదేశంపార్టీ ఫ్లెక్సీ తొలగించినప్పుడు కార్పొరేటర్లు సద్దల హేమలత, విజయశ్రీ, నాయకులు సద్దలశేఖర్, సరిపూటి శ్రీకాంత్ తదితరులు నగరపాలక సంస్థలో హంగామా చేశారు. -
ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమారు 7వేల మంది సిరియన్ వలస వాదులను అమెరికాలో కొనసాగేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘ప్రస్తుతం సిరియా అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వారిక్కడే(అమెరికాలో) నివసించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. మానవత్వ కోణంలో వారికిక్కడ తాత్కాలిక రక్షణ హోదాను (టీపీఎస్) కల్పిస్తున్నాం. దానిని మరికొంత కాలం కొనసాగించబోతున్నాం’’ అంటూ ట్రంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అయితే కొత్తగా వచ్చే శరణార్థుల దరఖాస్తులను మాత్రం అంగీకరించబోమని అమెరికా స్పష్టం చేసింది. ఇక ఈ ప్రకటనను అమెరికా హోంలాండ్ కార్యదర్శి క్రిస్ట్‌జెన్ నీల్సన్ ధృవీకరించారు. ఒక్క సిరియానే కాదు.. మిగతా దేశాల(నిషేధం ఎదుర్కుంటున్న 10 దేశాలు) శరణార్థుల విషయంలోనూ పునరాలోచన చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తాజా ఉత్తర్వులతో అమెరికాలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న సిరియన్లు.. మరో 18 నెలలపాటు నిరభ్యరంతంగా జీవించొచ్చు. అయితే ఎల్ సాల్వెడొర్, హైతి, నికారగువా తదితర ప్రాంతాల నుంచి శరణార్థుల తాకిడి ఎక్కువగా ఉంటుండటంతో.. ఆ మధ్య టీపీఎస్ విధానాన్ని ఆయా ప్రాంతాలకు రద్దు చేస్తూ ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2007లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా శరణార్థుల ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో శరణార్థుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. అయితే నిషేధం ఎదుర్కొంటున్న 11 దేశాలపై మాత్రం 90 రోజుల పాటు సమీక్షించాలని గతేడాది అక్టోబర్‌లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. -
టీపీఎస్‌గా అలివేలు
అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ సూపర్వైజర్గా అలివేలు నియమితులయ్యారు. మడకశిరలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె పదోన్నతిపై అనంతకు వచ్చారు. బుధవారం కమిషనర్ సత్యనారాయణ వద్ద రిపోర్ట్ చేసుకున్నారు.