
ప్రీ ప్రైమరీ విద్యార్థులకోసం ఇలా..
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు చోట్ల ఏర్పాటు
డే స్కాలర్ తరహాలో విద్యా సంస్థల నిర్వహణ
ఆరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో కళకళ
నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన
అత్యాధునిక స్థాయిలో వసతుల క్పలన
పబ్లిక్ స్కూల్ అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. అక్కడ చదువుతోపాటు ఆటపాటలు, సరికొత్త ఆలోచనలతో కూడిన బోధన, అభ్యసన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇలాంటి పాఠశాలను ఏకంగా ప్రభుత్వమే నిర్వహిస్తే ఇంకేముంది.. పేద, మధ్యతరగతి పిల్లలంతా పరుగెత్తి అందులో చేరిపోతారు. అలాంటిదే ఇక్కడా జరిగింది.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మార్గనిర్దేశంలో ఏర్పాటైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు ఈ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందింది.ఒకవైపు మౌలిక వసతుల కల్పన కొనసాగుతుండగానే... వందల మంది విద్యార్థులతో ఇప్పుడు ఈ పాఠశాల కళకళలాడుతోంది. పూర్వ ప్రాథమికం నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రహరీలో బోధన సాగుతోంది.
సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ విధానంలో కాకుండా డే స్కాలర్ పద్ధతిలో మరిన్ని స్కూళ్లు ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)పై కొన్ని సూచనలు చేశారు. దీంతో రాష్ట్రంలో నాలుగు చోట్ల టీపీఎస్‌లు ఏర్పాటయ్యాయి. ఒకే ప్రాంగణంలోకి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను జతచేయడంతోపాటు అక్కడే పూర్వప్రాథమిక పాఠశాలతోపాటు జూనియర్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇలా రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల, మంచాల, నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు, పోల్కంపల్లిలో వీటిని ఏర్పాటు చేశారు. ఆరుట్ల టీపీఎస్‌లో ఇప్పటికే వివిధ మౌలిక వసతుల కల్పన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది.
నాలుగు చోట్ల ఇలా...
⇒ ఆరుట్ల టీపీఎస్: ప్రాథమిక, ఉన్నత పాఠశాలతోపాటు తెలంగాణ మోడల్ స్కూల్‌ను ఒకే చోటకు తీసుకొచ్చారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్‌వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.
⇒ మంచాల టీపీఎస్: ప్రాథమిక పాఠశాలతో పాటు జెడ్పీహెచ్‌ఎస్(బాలికలు), జెడ్పీహెచ్‌ఎస్(బాలురు)లను ఒకే చోటకు తీసుకొచ్చారు. ఇక్కడ నర్సరీ నుంచి పదోతరగతి వరకు ఉంది.
⇒ వంగూరు టీపీఎస్: ఎంపీపీఎస్ వంగూరు, జెడ్పీహెచ్‌ఎస్(బాలికలు), జెడ్పీహెచ్‌ఎస్(బాలురు), కేజీబీవీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఒకే చోటకు తీసుకొచ్చారు. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతాయి.
⇒ పోల్కంపల్లి టీపీఎస్: ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఒకే చోటకు చేర్చాలని ఆదేశించింది. ఇక్కడ నర్సరీ నుంచి పదోతరగతి వరకు బోధన జరుగుతోంది.
ఎస్‌డీఎంసీ కీలకం...
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో పాఠశాల అభివృద్ధి నిర్వహణ కమిటీ (ఎస్‌డీఎంసీ)లే కీలక పాత్ర పోషిస్తాయి. పాఠశాల పరిధిలో ఎలాంటి పనులైనా టెండర్లు లేకుండా కేవలం ఎస్‌డీఎంసీల ఆమోదం, పర్యవేక్షణలోనే నిర్వహించాలి. ప్రస్తుతం ఆరుట్ల టీపీఎస్‌లో ఇదే తరహాలో అబివృద్ధి పనులు సాగుతున్నాయి. ఎస్‌డీఎంసీలో 23 మంది సభ్యులున్నారు.
⇒ ఇప్పటికే బాస్కెట్‌బాల్ కోర్టు, బాక్స్ క్రికెట్ , కోకో గ్రౌండ్ పూర్తయ్యాయి.
⇒ గ్రంథాలయం, డైనింగ్ హాళ్లు, సీసీరోడ్డు పనులు కొనసాగుతున్నాయి.
⇒ క్లాస్‌రూమ్‌లు కూడా రంగురంగుల్లో అత్యాధునిక ఫర్నిచర్‌తో ఏర్పాటు చేశారు.
⇒ వివిధ రకాల ఆటవస్తువులు అందుబాటులో ఉండడంతో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా బడికి వస్తున్నారు.
అప్పుడు 700 మంది.. ఇప్పుడు 1,629 మంది విద్యార్థులు
ప్రస్తుతం ఆరుట్ల టీపీఎస్ పరిధిలో పూర్వ ప్రాథమిక పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేశారు. ఇందులో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలు రెండేసి సెక్షన్లున్నాయి. మొత్తం ఆరు సెక్షన్ల పరిధిలో 126 మంది చిన్నారులున్నారు.
⇒ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్ ముందు నుంచే కొనసాగుతున్నాయి. ఈ మూడింటిలో 700 మంది ఉండగా... టీపీఎస్ తర్వాత విద్యార్థుల సంఖ్య 1,629కు చేరింది.
⇒ ప్రాథమిక పాఠశాలలో ఇదివరకు 90 మంది విద్యార్థులుండగా... ఇప్పుడా సంఖ్య 514కు చేరింది.
⇒ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు 250 నుంచి 360కి పెరిగారు. మోడల్ స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య 350 నుంచి 629కి చేరింది.
⇒ ప్రీప్రైమరీ టీచర్లను కమిటీ ఆధ్వర్యంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. ఒక్కో టీచర్‌కు రూ.15 వేలు, ఆయాకు రూ.10 వేలు వేతనాలిస్తున్నారు.
బస్సుల నిర్వహణకు రాయితీ
బస్సుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఒక్కో బస్సుపై గరిష్టంగా రూ.12.5 లక్షలు రాయితీ ఉంది. ఆరుట్లలో మూడు బస్సులు నడుపుతూ 200 మంది విద్యార్థులను సమీప గ్రామాల నుంచి రోజూ స్కూల్‌కు చేర్చుతున్నారు. బస్సు నిర్వహణ కోసం వాటిల్లో వచ్చే విద్యార్థుల నుంచి నామమాత్రంగా ఫీజులు తీసుకుంటున్నారు.
సీఎస్‌ఆర్ కింద రూ.3 కోట్లు వచ్చాయి
పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే నిధులకు అదనంగా సీఎస్‌ఆర్ నిధులు కూడా దాదాపు రూ. 3 కోట్ల వరకు రాగా, అభివృద్ధి పనులకు ఖర్చు చేశాం. పనులను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. –ఎస్.గిరిధర్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు
టీచర్ల పిల్లలూ ఇక్కడే...
మా పాఠశాలలో దాదాపు 20 మంది పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ టీచర్లుగా పనిచేస్తున్నారు. ప్రతి శనివారం ఎస్‌డీఎంసీ సమావేశం జరుగుతుంది. కమిటీ సభ్యులు తప్పకుండా హాజరవుతారు. ఆ సమావేశంలో చర్చలు జరిపి అవసరాలకు అనుగుణంగా తీర్మానం చేసి కార్యాచరణ మొదలు పెడతాం. – కంబాలపల్లి భాస్కర్, ఎస్‌డీఎంసీ సభ్యుడు