సౌదీ అరేబియా.. అత్యంత ధనిక దేశం.. చమురు నిల్వలకు కొదవలేదు. బంగారపు కొండలూ ఉన్నాయి. మక్కాలాంటి పవిత్ర స్థలం ఉండటంతో ప్రపంచ దేశాలకు చెందిన కోట్లాది మంది ముస్లింలు పర్యటిస్తుంటారు. సాంప్రదాయాలకు అధిక విలువనిస్తూ.. మత పరమైన రాజ్యంగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాలో ఓ కొత్త నగరం సిద్ధమవుతోంది. నగరం సిద్ధం కావడమేంటా? అని ఆశ్చర్యపోతున్నారా?. అవును.. నియోమ్ సిటీగా దీనికి నామకరణం చేశారు.
నియోమ్ స్మార్ట్ సిటీ నిర్మాణానికి సౌదీ ప్రభుత్వం నాంది పలికింది. ప్రపంచంలోనే అత్యాధునిక, అధునాతన టెక్నాలజీతో ఆ పట్టణాన్ని తయారు చేస్తున్నారు. ఆ సిటీ తయారీ కోసం కొన్ని వేల కంపెనీలు రేయింబవళ్లు పని చేస్తున్నాయంటే సిద్ధమవుతున్న ఆ సిటీ ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.. వాస్తవంగా ఆ నగరం చూడటానికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో భాగంలా కనిపిస్తుంది. అసలు ఆ నగరానికి సంబంధించిన అద్భుతమైన ప్రపోజల్ పరిశీలిస్తే.. ఈ నగరం నిజంగా రెడీ అవుతుందా?. ఇది సాధ్యమేనా?. ఈ డిజైన్‌లో నిజంగా ఏ ప్రయోజనాలున్నాయి?. ఎలాంటి నష్టాలు ఉంటాయి?. ఇలాంటి మెగా ప్రాజెక్ట్ ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అనుమానాలు తలెత్తడం సహజమే.
సౌదీ అరేబియా దేశం పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి రెండు అంశాలు.. ఒకటి ఎడారి.. రెండోది చమురు నిల్వలు. ఎందుకంటే.. ఈ దేశం ఎక్కువగా ఎడారులతో చుట్టుముట్టి... సౌదీలో ఎటు చూసినా సాధారణ ఎడారి వాతావరణం కనిపిస్తుంది. ఎడారి దేశాన్ని.. ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక సిటీగా మార్చాలనే ఆలోచనతో ‘నియోమ్’ అనే స్మార్ట్ సిటీని నిర్మించాలని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నిర్ణయించుకున్నారు. తన దేశంలోని ఒక పెద్ద ప్రాంతంలో ఆ సిటీని డెవలప్ చేయాలని దానికి ‘నియోమ్’ సిటీ అని నామకరణం చేశారు. నియోమ్ అనేది ఒక స్మార్ట్ సిటీ మాత్రమే కాదు.. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ పేరు.
3/15 NEOM
The $1.5 trillion project isn't projected to be complete until at least 2045.
This Megacity Neom is currently using 20% of all the steel in the world. pic.twitter.com/3QPjgfs6eP— ZOYA ✪ (@HeyZoyaKhan) December 8, 2024
సౌదీ అరేబియాలో ఉత్తర–పశ్చిమ భాగంలో రెడ్ సీ ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని ఈ సిటీ నిర్మాణానికి ఎంచుకున్నారు. సిటీ పరిమాణం దాదాపు ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిమాణానికి సగానికి సమానం అని చెప్పవచ్చు. అసలు సౌదీలో అదే ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణమేంటంటే అక్కడి వాతావరణం సౌదీ దేశంలో ఉండే వేడి వాతావరణంగా కాకుండా నార్మల్‌గా ఉంటుంది. ఆ సిటీకి నియోమ్ పేరు పెట్టడానికి కారణాలేంటని విశ్లేషిస్తే... ప్రిన్స్ పేరు మహమ్మద్ బిన్ సల్మాన్ పేరు నుంచి అరబిక్ భాష ఆధారంగా అక్షరాలు సేకరించినట్లు సమాచారం.
నియోమ్ సిటీ సౌదీ అరేబియాలోని అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 0°C కంటే తక్కువకు పడిపోతాయి. ఇక్కడి మంచును కూడా వినియోగంలోకి తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. దీని డిజైన్. 170 కిలోమీటర్ల పొడవైన ఒక లైన్. ఈ నగరం 200–500 మీటర్ల ఎత్తైన స్కై స్క్రేపర్ల మధ్య నిర్మించనున్నారు. ఇవి లీనియర్ ఫార్మ్‌లో ఉంటాయి. ఈ నగరం బయట వాతావరణం నుండి పూర్తిగా సంబంధం లేకుండా లోపలే స్వయం సమృద్ధిగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. న్యూయార్క్ నగర పరిమాణం కంటే దాదాపు 20 రెట్లు పెద్ద నగరం ఇది. 26,500 చదరపు కిలోమీటర్లు.. 10,500 చదరపు మైళ్ల వైశాల్యంలో ఈ నగరం సిద్ధమవుతోంది. కాబట్టి ఫుట్‌ప్రింట్ చాలా పెద్దది. నగరంలో మల్టిపుల్ లేయర్లు ఉంటాయి. పార్కులు, గ్రీన్ స్పేస్‌లు ఉంటాయి. 170 కిలోమీటర్ల పొడవైన లైన్ కావడంతో హై-స్పీడ్ రవాణా వ్యవస్థను వినియోగిస్తున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్‌లో సమస్యలు కూడా ఉన్నాయి. అందులో ప్రధాన సమస్య ఫైనాన్స్. కొన్ని నివేదికల పరిశీలనల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ 2050 వరకు కూడా పూర్తికాకపోవచ్చు. సిటీ నిర్మాణానికి మొత్తం ఖర్చు 1 ట్రిలియన్ డాలర్ల దాకా.. అంటే ఇండియన్ కరెన్సీలో 85 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. దానికోసం సౌదీ వద్ద వనరులు సిద్ధంగా లేకపోవడంతో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు.. ప్లానింగ్‌కు అనుగుణంగా వినియోగించాల్సిన టెక్నాలజీ కూడా ఓ సవాలుగా మారింది. నియోమ్ సిటీలో ఒక చివర నుండి మరో చివర వరకు 20 నిమిషాల్లో ప్రయాణం చేయాలని నిర్ణయించారు. అంటే ప్రతి గంటకు 500 కంటే ఎక్కువ వేగం ఉండాలి.. కానీ ఇంత వేగం ఇచ్చే టెక్నాలజీ ఇప్పటివరకు లేదు. 2015లో జపాన్‌లో మాగ్లేవ్ ట్రైన్ టెస్ట్ రన్‌లో గంటకు 603 కిలోమీటర్ ప్రయాణించినప్పటికీ.. రెగ్యులర్ ఆపరేషన్లలో గంటకు 430 కిలోమీటర్లు మాత్రమే వేగం ఉంటుంది.
మరో విషయం ఏమిటంటే నియోమ్ సిటీలో 500 మీటర్ల ఎత్తైన గాజుతో కప్పే భవనాలను నిర్మించడం. దాని కోసం తక్కువ మోతాదులో కార్బన్ మెటీరియల్స్ వినియోగించడం దాదాపు అసాధ్యం. ఓవరాల్‌గా సిటీ నిర్మాణంతో స్థలం ఆదా అవుతున్నప్పటికీ.. సమస్యలు పెరిగే అవకాశముంది. ఇక సౌదీ ప్రజలు ఇన్ని సవాళ్లను అధిగమించినా, ప్రజలు నిజంగా ఇక్కడ నివసించాలనుకుంటారా? అనేదీ ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉంది.


